డ్రగ్స్​ను అరికట్టడంలో..కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

డ్రగ్స్​ను అరికట్టడంలో..కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోందని, దానిని అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఎస్పీ స్టేట్​చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డ్రగ్స్, మర్డర్ కల్చర్ లేని ఆరోగ్య తెలంగాణ కావాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో డ్రగ్స్​, మర్డర్ కల్చర్ తోపాటు అధిక వడ్డీ వసూళ్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాకు ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. హైదరాబాద్ సిటీలో మత్తు పదార్థాల సరఫరా వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోందని ఆరోపించారు.

దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం, నార్కొటిక్స్ డిపార్ట్​మెంట్​ విఫలమయ్యాయని విమర్శించారు.సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో మర్డర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. సీఎంకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడంలో లేదన్నారు. 

విద్య, వైద్యం, ఉపాధి పై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. 2014 కు ముందు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు వస్తే, ప్రస్తుతం 40 వేల కోట్ల ఆదాయం వస్తున్నదన్నారు. బడ్జెట్ లో విద్యకు కేవలం 8 వేల కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసేది కేవలం 6 వేల కోట్లేనని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో ఎంబీటీ నేత ఖలీల్, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.