లిక్కర్​ నోటిఫికేషన్ తప్ప.. కొలువులెక్కడ?.. రఘునందన్​రావు

లిక్కర్​ నోటిఫికేషన్ తప్ప.. కొలువులెక్కడ?.. రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: కేసీఆర్​ ప్రభుత్వ హయాంలో లిక్కర్​ నోటిఫికేషన్​ తప్ప.. నిరుద్యోగులకు కొలువులిచ్చింది లేదని ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలం కాసులాబాద్​, మల్లుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్​ప్రభుత్వం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో నిధులు ఇవ్వాలని ప్రశ్నించానని పేర్కొన్నారు.

 రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా ఏదో ఒక కారణంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయిస్తోందని మండిపడ్డారు. దళిత బంధు, బీసీ బంధు, డబుల్​ బెడ్రూమ్,​ గృహలక్ష్మి పథకాలను బీఆర్​ఎస్​ కార్యకర్తలకే ఇచ్చి పేద ప్రజలకు మొండి చేయి చూపిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేవరాజు, మద్దెల రోశయ్య, కనకయ్య, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

నిరుద్యోగులను బలిగొన్న కేసీఆర్​ సర్కార్​

మెదక్ టౌన్:  తెలంగాణ వచ్చి పదేళ్లు గడుస్తున్నా కేసీఆర్​ ప్రభుత్వం నిరుద్యోగులను బలి తీసుకుందే తప్ప ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని ఎమ్మెల్యే  రఘునందన్​రావు విమర్శించారు. పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రఘునందన్​రావు  మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు నెలల ముందే నోటిఫికేషన్లు వేసినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు.

ఇటీవల గ్రూప్​ 2 అభ్యర్థి ప్రవల్లిక సూసైడ్​ చేసుకుంటే దానికి వేరే కారణమని కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్​, నిజాంపేట జడ్పీటీసీ విజయ్​ కుమార్​,  జనార్ధన్​రెడ్డి, రాజశేఖర్​, నందారెడ్డి, విజయ్​ కుమార్​, సుధాకర్​రెడ్డి, వీణ, ప్రసాద్​ పాల్గొన్నారు. 

దుబ్బాక అభివృద్ధికి సహకరించలేదు

మెదక్ (చేగుంట): దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి హరీశ్​రావు సహకరించలేదని ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆరోపించారు. చేగుంట మండలం వడ్యారం లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంగళ్​రావు తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. గతంలో చేగుంట మండల పరిషత్, తహసీల్దార్ ఆఫీస్​ల  ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్​రావు దుబ్బాక నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులడిగితే మాట దాటవేశారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్, మాజీ ఎంపీపీ పాండు, మాజీ సర్పంచులు బాలచందర్,  రఘువీర్రావు, నాగభూషణం, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేశ్​, జ్ఞానేశ్వర్, అంజగౌడ్, నాగరాణి పాల్గొన్నారు.