
హైదరాబాద్, వెలుగు: సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఓ భారతీయుడిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ దేశంలో ఉన్నా మానవాళికి నష్టం కలిగిస్తుంది తప్ప లాభం చేయదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదం కచ్చితంగా అంతం కావాల్సిందేనని తెలిపారు.
ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయని చెప్పారు. సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో.. అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశరక్షణలో ఎవరికీ తీసిపోమన్నట్టుగా సైన్యానికి శక్తిసామర్థ్యాలను దేవుడు ప్రసాదించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.