హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పు చేయకపోతే విద్యుత్తు కొనుగోళ్లపై జరుగుతున్న విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాను చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయం కేసీఆర్ లో మొదలైందని, ఈ తప్పులకు శిక్ష పడుతుందనే తెలిసి కమిషన్ ముందు హాజరుకాలేదని విమర్శించారు.
శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ కు 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ అదే విషయాన్ని దాని ముందు హాజరై చెప్పుకోవచ్చు కదా అని తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లలో భారీ కుంభకోణమే జరిగిందని, ఈ అక్రమాలు బయటకు రావాలని.. నిజాలు ప్రజలకు తెలియాలన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా విచారణకు సహకరించాలని కోరారు.