కేసీఆర్ ఓ పెద్ద నియంత : టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

కేసీఆర్ ఓ పెద్ద నియంత : టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
  •  ఆయనది ఆంధ్ర పాలకులను మించిన దోపిడీ
  • అందుకే జనం గుణపాఠం చెప్పిన్రు

సంగారెడ్డి, వెలుగు: గడిచిన పదేండ్లలో కేసీఆర్​ఓ పెద్ద నియంతలా వ్యవహరించారని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఆంధ్ర పాలకులను మించిన దోపిడీ చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్లో గురువారం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో కోదంరాంను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్ద కాలపు దోపిడీకి, అధికార దురహంకారానికి జనం ఓటు అనే ఆయుధంతో స్వస్తి చెప్పారన్నారు. కాంగ్రెస్ గెలుపుతో.. తెలంగాణకున్న సంకెళ్లు తెగిపోయాయని, బీఆర్ఎస్ నేతల రంది పోయిందని తెలిపారు.

పదేండ్ల  పాలనలో బీఆర్ఎస్​నేతలు ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ యథేచ్ఛగా రాష్ట్ర వనరులు దోచుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించే తత్వాన్ని సహించకపోగా, అనవసరమైన కేసుల్లో ఇరికించారని, సంఘాలను చీల్చి నాయకులను బలహీనపరిచారని మండిపడ్డారు. కాంగ్రెస్​వచ్చాక బీఆర్ఎస్ దౌర్జన్యాలు, విధ్వంసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. గతంలో భూముల విలువ పెంచుకోవడానికి 111 జీఓను రద్దు చేశారన్నారు. భవిష్యత్​లో ట్రిపుల్​ఆర్ పేరిట భూసేకరణ ఉండదని కోదండరాం స్పష్టం చేశారు.

 50 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, నేరుగా సెక్రటేరియట్, ప్రజా భవన్ లో సమస్యలు విన్నవించుకునే పరిస్థితులు తీసుకొచ్చారన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి వనరుల దోపిడీని ఆపగలిగారన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఆర్థిక సాయం అందించాలని ఆకాంక్షించారు. ఓటమిని జీర్ణించుకోలనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంటారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్​రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, టీపీటీఎఫ్​ జిల్లా కార్యదర్శి రామచందర్, పలువురు ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.