మారుమూల జిల్లాలకూ మెడికల్ కాలేజీల ఘనత కేసీఆర్​దే : హరీశ్

మారుమూల జిల్లాలకూ మెడికల్ కాలేజీల ఘనత కేసీఆర్​దే : హరీశ్

హైదరాబాద్, వెలుగు: మారుమూల జిల్లాల్లో మెడికల్​ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలపై ఆయన నిమ్స్ నుంచి సమీక్ష నిర్వహించారు.  కొత్త మెడికల్ కాలేజీల పనులు స్పీడప్​ చేయాలని,  జులై నాటికి క్లాసులు ప్రారంభించేందుకు రెడీ కావాలన్నారు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల రిక్రూట్​మెంట్ పూర్తి చేయాలన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. గతేడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు కొట్టగా, ఈ ఏడాది జనగాం, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. 

కేంద్రం ఒక్కటీ ఇయ్యలేదు

కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా వివక్ష చూపిందని హరీశ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు వైద్యంతో పాటు, వైద్య విద్యను చేరువ చేసేందుకు సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఈ సమీక్షలో మంత్రులు సత్యవతి రాథోడ్, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, టీఎస్​ఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

మాతాశిశు మరణాలు తగ్గించాం

రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గించి దేశంలో 3వ స్థానంలో నిలిచామని మంత్రి హరీశ్  అన్నారు. సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్స్​పై రూ.490 కోట్లు ఖర్చుచేస్తున్నామని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మాతాశిశు మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. మంగళవారం నిమ్స్​లో 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం (సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్) ఆసుపత్రికి మంత్రి భూమిపూజ చేసి మాట్లాడా రు. జిల్లాలు, ఇతర ఎంసీహెచ్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖాన్ల  నుంచి ఈ కేంద్రానికి రిఫరల్ వ్యవస్థలో చికిత్స అందేలా చూస్తామన్నారు.

త్వరలో గాంధీలో, అల్వాల్​లో మరో రెండు ఎంసీహెచ్​లను తీసుకువస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధునాతన సౌకర్యాలతో 2వేల పడకలను నిమ్స్​లో అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్  స్థలాన్ని నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిమ్స్​లో డయాలిసిస్​ మెషీన్లను 34 నుంచి 100కు పెంచామన్నారు.