తెలంగాణను కేసీఆర్ దోచుకున్నడు : వివేక్ వెంకటస్వామి

తెలంగాణను కేసీఆర్ దోచుకున్నడు : వివేక్ వెంకటస్వామి
  •  ఆయన కుటుంబం 20 వేల ఎకరాలు స్వాహా చేసింది 

నిర్మల్, వెలుగు: పదేండ్ల పాలనలో కేసీఆర్ అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ధరణి పోర్టల్ పేరిట కేసీఆర్ కుటుంబం 20 వేల ఎకరాల ప్రభుత్వం భూములను స్వాహా చేసిందని ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో వివేక్ మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో కేసీఆర్ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడు. మిషన్ భగీరథలో పాత పైపులు వేసి రూ.40 వేల కోట్లు దోచుకున్నడు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నడు. దీని కారణంగా రాష్ట్రం అప్పులపాలైంది” అని ఫైర్ అయ్యారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరు గ్యారంటీల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నరు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలవుతున్నాయి. మిగతావి కొద్దిరోజుల్లోనే ప్రారంభమవుతాయి. ఈ గ్యారంటీలతో పేద ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది” అని అన్నారు.

‘‘గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ దర్శనం లభించేది కాదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చారు. సీఎంను అందరూ కలిసే అవకాశం లభించింది” అని అన్నారు. ‘‘కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పాదయాత్రతో ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. రాహుల్​ను ప్రధాని చేయాలనే రేవంత్ తపన పడుతున్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి” అని పిలుపునిచ్చారు.