ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్… ఇంకో పదేండ్లు నేనే సీఎం

ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్… ఇంకో పదేండ్లు నేనే సీఎం

పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్పష్టత

హైదరాబాద్: తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. దీనిపై అనవసర ప్రచారం చేయొద్దంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. నేతలెవ్వరు బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని సీఎం సూచించనట్లు సమాచారం.

త్వరలో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు సమాచారం. ఏ జిల్లా వాళ్ళు ముందుకొస్తే అక్కడే సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మార్చ్ ఒకటి నుండి పార్టీ కమిటీల నియామకం ఉంటుందన్నారు. ఈ సారి జిల్లా ఇంఛార్జిలను నియమిస్తామన్నారు. 11 న మేయర్ ఎన్నికలకు అందరూ తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్లతో కలిసి జిహెచ్ఎంసీ ఆఫీసుకు వెళ్ళాలని సూచించారు. సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. రెండు నెలల పాటు ప్రతి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు.