ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ సభ

ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ సభ
  •     ఆ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ మీటింగ్
  •     రంజిత్‌రెడ్డి ద్రోహి, స్వార్థపరుడంటూ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల13న చేవెళ్లలో బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. సభ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇతర నాయకులకు ఆయన సూచించారు. 

కాసానితోపాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణీ దేవి, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులతో తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన రంజిత్‌రెడ్డిని ఈ సారి ఎన్నికల్లో ఓడించాలన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీగా గెలిపించేవరకూ రంజిత్‌రెడ్డి ఎవరో ప్రజలకు తెల్వదన్నారు. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన కాంగ్రెస్ లో చేరారన్నారు. 

పార్టీ కంటే తామే ఎక్కువ అని అహంకారంతో ఉండేవాళ్లు సక్సెస్ కాలేరని, ఇందుకు కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి ఉదాహరణ అని చెప్పారు. ‘‘ఎమ్మెల్సీ కవితను సోదరిగా భావిస్తానని రంజిత్ రెడ్డి చెప్పుకునేవాడు. కానీ ఆమెను ఈడీ అరెస్ట్‌ చేసిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయాడు. ఆయనో స్వార్థపరుడు, ద్రోహి’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయిన రంజిత్‌రెడ్డిని, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి ఓడించాలన్నారు. వచ్చే నెల13న జరగబోయే సభను అందరూ కలిసి సక్సెస్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొందని.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలవడం అసాధ్యమన్నారు.