రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టిన కేసీఆర్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టిన కేసీఆర్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ‘పాలమూరు’ సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పెద్ద తప్పు చేసిన్రు: మంత్రి ఉత్తమ్​
  •     శ్రీశైలానికి మార్చడం ద్వారా ప్రాజెక్ట్ వ్యయం రూ.80 వేల కోట్లకు పెరిగింది
  •     అందులో రూ.27 వేల కోట్ల పనులే చేసి 90 శాతం పూర్తి చేశామనడం పచ్చి అబద్ధం
  •     జూరాల సోర్సుగా పాలమూరు ప్రాజెక్టుకు 2013లోనే కాంగ్రెస్​ ప్రభుత్వం జీవో ఇచ్చింది
  •     కృష్ణా జలాలపై ‘నీళ్లు నిజాలు’ పేరిట ఉత్తమ్ ప్రెజెంటేషన్

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ నిర్ణయంతోనే తెలంగాణ జల ప్రయోజనాలకు బీఆర్ఎస్ నష్టం చేసిందని, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెంచేశారని ఆరోపించారు. అంతేగాకుండా ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కూడా లేకుండా పోయాయని విమర్శించారు. 

గురువారం ఆయన కృష్ణా నదీ జలాలపై ‘నీళ్లు నిజాలు’ పేరుతో ప్రజాభవన్​లో పవర్​పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ జల ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇది కేవలం తప్పు కాదని, రాష్ట్ర భవిష్యత్​ను ఉద్దేశపూర్వకంగా తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు. జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టి ఉంటే రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు అందేవన్నారు. 

గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకుపైగా పెరిగిందని ఆరోపించారు. ప్రాజెక్ట్​లో 90 శాతం పనులు చేశామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాను విస్మరిస్తున్నామని చెబుతున్నారని, ఆ మాటలన్నీ అబద్ధమని పేర్కొన్నారు. 2015 జూన్ 10న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. అంచనా వ్యయం రూ.35 వేల కోట్లుగా పేర్కొన్నారని చెప్పారు. వాళ్లు ఖర్చు పెట్టింది రూ.27 వేల కోట్లు అని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు, ఆయకట్టు పనులు సహా వర్క్​ పూర్తవ్వాలంటే రూ.80 వేల కోట్లు దాటుతుందన్నారు. 

మరి, రూ.80 వేల కోట్ల పనులకు.. కేవలం రూ.27 వేల కోట్ల పనులే పూర్తి చేసి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ చెప్పడం ఎంత సత్యదూరమో ఆలోచించాలన్నారు. 2015లో ప్రాజెక్టు జీవో ఇచ్చి.. ఏడేండ్ల తర్వాత 2022 సెప్టెంబర్ 13న డీపీఆర్​ను బీఆర్ఎస్ పాలకులు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డీపీఆర్​లో ప్రాజెక్టు ఖర్చును రూ.55 వేల కోట్లుగా చూపించారన్నారు. రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము ప్రాజెక్టుపై రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుకు బీజం

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. 2013 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దాని ప్రకారం జూరాల ఆధారంగానే ముందుకెళ్తే పాలమూరు ప్రాజెక్టు పాత ప్రాజెక్టుగానే ఉండేదని, నీటి కేటాయింపులు వచ్చి ఉండేవని చెప్పారు. జూరాల నుంచి ప్రాజెక్టును చేపట్టి ఉంటే 70 టీఎంసీలను తీసుకునేందుకు వీలుండేదన్నారు. కృష్ణా బేసిన్​లోని మెయిన్ స్ట్రీమ్​లో జూరాల ఫస్ట్​ ప్రాజెక్ట్ అని, అప్పర్ కృష్ణా సబ్ బేసిన్, అప్పర్ భీమా సబ్ బేసిన్​లో ఉండడం వల్ల.. పశ్చిమ కనుమల నుంచి కూడా వరద వస్తుందని చెప్పారు. 

శ్రీశైలానికి మార్చడం వల్ల అప్​స్ట్రీమ్​లో ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చే వరదపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరంలో అదనపు రెండు టీఎంసీల కోసం.. నాటి బీఆర్ఎస్ పాలకులు రూ.20 వేల కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. అదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కెపాసిటీని కేవలం ఒక టీఎంసీకి ఉద్దేశపూర్వకంగా తగ్గించారన్నారు. తద్వారా ఏపీ నిర్మించతలపెట్టిన రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు బాటలు వేశారన్నారు.

ఏపీకి తాకట్టు పెట్టిన్రు

తెలంగాణ జల ప్రయోజనాలు కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ను ప్రారంభించగానే.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పక్కన పెట్టిందన్నారు. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపించిందని, ఎక్కడా రాజీపడలేదని స్పష్టం చేశారు. 

దీనిపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్​జగన్మోహన్ రెడ్డి.. ట్రిబ్యునల్​లో బలమైన వాదనలు ఎందుకు వినిపించడం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు నవంబర్​లో లేఖ రాయడమే అందుకు నిదర్శనమన్నారు. కృష్ణా బేసిన్​లో అందుబాటులో ఉన్న 1050 టీఎంసీల జలాల్లో 763 టీఎంసీలకు డిమాండ్​చేస్తున్నామని, ఆ జలహక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని స్పష్టం చేశారు. 8 నెలల్లో బ్రజేశ్​ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.