కేసీఆర్ బిగ్ స్కెచ్: లిక్కర్ కేస్ Vs ఆపరేషన్ ఫాంహౌస్

కేసీఆర్ బిగ్ స్కెచ్:  లిక్కర్ కేస్ Vs ఆపరేషన్ ఫాంహౌస్

ఎస్ఐబీని జేబు సంస్థలా వాడుకున్నగులాబీ బాస్
 బిడ్డను రక్షించేందుకే తెరపైకి ఎమ్మెల్యేల కేసు
 బీఎల్ సంతోష్ రాకపోవడం తో కథ తారుమారు
 కీలకంగా మారిన రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ 

హైదరాబాద్: తన కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి రక్షించుకునేందుకు గులాబీ బాస్ బిగ్ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఆపరేషన్ ఫాం హస్ కథను నడిపినట్టు తెలుస్తోంది. ఇందులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి.. బిడ్డను లిక్కర్ స్కాం కేసు నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా వెల్లడవుతోంది. 

కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోతునట్టు కేసీఆర్ కు సమాచారం అందిందని, ఈ వివరాలను ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు చెప్పారని రాధాకిషన్ రావు తన నేరాంగీకార పత్రం(కన్ఫెషన్ స్టేట్ మెంట్)లో పేర్కొన్నారు.   ఎస్ఐబీ చీఫ్​ ఆదేశాల మేరకే తాము ఈ ఆపరేషన్ లో పాల్గొన్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కొన్ని ఆడియోలు కేసీఆర్ కు అందగానే ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నం మొదలైందని అంటున్నారు. ఫాంహౌస్ లో ట్రాప్ చేసేందుకు స్పై కెమెరాలు, మెటీరియల్ ఢిల్లీలో కొనిపించారని రాధాకిషన్ రావు తన స్టేట్ మెంట్ లో తెలిపారు. 

బీఎల్ ను అరెస్టు చేస్తేనే బిడ్డ బయట పడ్తది

బీజేపీ కీలక నేతగా ఉన్న బీఎల్ సంతోష్​ ను అరెస్టు చేయడం ద్వారా తన కూతురుని లిక్కర్  స్కాం కేసు నుంచి విముక్తురాలిని చేయాలని కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఫాం హౌస్ కథ నడిపారని తెలుస్తోంది. 2022 అక్టోబర్ 26న కొల్లాపూర్, అచ్చంపేట, తాండూరు, పినపాక, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు తో డీల్ సెట్ చేసుకునేందుకు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ వచ్చారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారాన్ని ట్రాప్ చేసేందుకు ఢిల్లీలో ఖరీదైన కెమెరాలు, మెటీరియల్ కొనిపించారని రాధాకిషన్ రావు తెలిపారు. వాటి ఆధారంగా రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ను ట్రాప్ చేశారని, వారిపై రకరకాల కేసులు నమోదు చేశారని తెలిపారు. అప్రూవర్లుగా  మారి  అమిత్ షా, తుషార్, బీఎల్ సంతోష్​, నడ్డా పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో నందకుమార్ పై మూడు రోజుల్లోనే 11 కేసులు నమోదయ్యాయి. బీఎల్ సంతోష్ పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చినా చెప్పకపోవడంతో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ అయిందని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.