రైతు ఉద్యమాలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది

రైతు ఉద్యమాలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది

రైతుల‌కు ఫ్రెండ్లీగా ఉన్న ప్ర‌భుత్వాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి అస్స‌లు గిట్ట‌నే గిట్ట‌ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రైతులను ఏదో విధంగా ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు. కేంద్రం అనుస‌రిస్తున్న రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వాల‌ను మార్చే శ‌క్తి రైతుల‌కు ఉంద‌న్నారు. తాము ఒంట‌ర‌య్యామ‌ని రైతు కుటుంబాలు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, తామంతా అండ‌గా ఉన్నామ‌న్నారు. 

దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్య‌మానికి త‌మ ప్ర‌భుత్వం పూర్తి అండ‌గా ఉంటుంద‌న్నారు. చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌ను, గాల్వాన్ స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా 600 కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక స‌హాయం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

స్వాతంత్య్రం వ‌చ్చి ఏళ్లు గ‌డిచినా ఇంకా ఇలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌డం అత్యంత బాధాక‌రమన్నారు. ఇలాంటి స‌భ‌లు చూసినప్పుడు క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయని, దేశం ఎందుకిలా ఉంద‌ని అనిపిస్తుందన్నారు. దీని మూలాలేమిటో ఆలోచించాలని, చ‌ర్చ కూడా జ‌ర‌గాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి, రైతులు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకున్నారని, సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని, వారంద‌రికీ శ‌త‌కోటి ప్ర‌ణామాలు అని చెప్పారు. రైతు కుటుంబాలు ఒంట‌రిగా లేవని, వారికి దేశంమొత్తం అండ‌గా ఉందన్నారు. 

దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ ను మర్చిపోం
స్వాతంత్య్రం కోసం పోరాడిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ లాంటి గొప్ప వ్య‌క్తిని క‌న్న రాష్ట్రం పంజాబ్‌ అన్నారు సీఎం కేసీఆర్. దేశ‌వ్యాప్తంగా ఆహారానికి క‌ష్టంగా ఉన్న స‌మ‌యంలో హ‌రిత విప్ల‌వాన్ని తీసుకొచ్చారని, ఆ స‌మ‌యంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారని చెప్పారు. ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతుల‌ను ఎవరూ మ‌రిచిపోరని, వారి సేవ‌లు చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌వ‌చ్చన్నారు. 

మీట‌ర్లు బిగించ‌మ‌ని చెప్పాం
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు చాలా కష్టాలు పడ్డారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  24 గంట‌ల పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌రెంట్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌న్న కొత్త నిబంధ‌న తీసుకొచ్చిందని, అయితే.. మీట‌ర్లు బిగించ‌మ‌ని అసెంబ్లీ నుంచే తీర్మానం చేశామన్నారు. 

నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పోరాటం చేస్తే వారిని ఖ‌లిస్తాన్ ఉగ్ర‌వాదులంటూ ఆరోప‌ణ‌లు చేశారని, ఇలా మాట్లాడడం దుర‌దృష్ట‌క‌రమన్నారు. దేశంలోని రైతులంద‌రూ ఉద్య‌మంలోకి రావాలని, ప్ర‌భుత్వాల‌ను మార్చే శ‌క్తి రైతుల‌కు ఉందన్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో ఏ ప్ర‌భుత్వ‌మైతే చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తుందో వారికే మ‌ద్ద‌తివ్వాలని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం.. 
తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోడీ ట్వీట్
మూడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు