మళ్లీ గెలిచేది మనమే అందులో డౌట్ లేదు: కేసీఆర్

మళ్లీ గెలిచేది మనమే అందులో డౌట్ లేదు: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో  మళ్లీ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుమ్మలూరులో హరితోత్సవంలో పాల్గొన్నారు కేసీఆర్. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.  అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్న కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తామని.. అందులో  ఎలాంటి డౌట్ లేదని చెప్పారు.

మహేశ్వరంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నామని తెలిపారు కేసీఆర్. అలాగే శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రోను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రోపై చర్చలు జరుగుతున్నాయన్నారు.  అలాగే తుమ్ములూరులో విద్యుత్ సబ్ స్టేషన్  మంజూరు చేస్తున్నామన్నారు. తుమ్మలూరులో కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామన్న కేసీఆర్.. దశాబ్ధి కమ్యూనిటీ హాల్ అని పేరు పెట్టాలని సూచించారు. 
 
మొదట్లో హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులేశారని.. తెలంగాణలోని గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయన్నారు కేసీఆర్.  తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. ఏడేళ్లలో హరితహారం ఖర్చు రూ.10 వేల కోట్లని వెల్లడించారు. 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని.. గోదావరి నీళ్లను చేవేళ్ల ప్రాంతానికి  తెచ్చే బాధ్యత తనదేనని చెప్పారు.  గోదావరి నీటిని హిమాయత్ సాగర్, గండిపేటకు లింక్ చేస్తామని తెలిపారు.  చేవేళ్ల ప్రాంతానికి కొన్ని రోజుల్లోనే నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.  దేశంలో వడ్లు పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేసులో ఉందన్నారు. గతంలో తనకు దాసరపల్లిలో పొలం ఉండేదని..నీళ్ల కోసం 10-15 బోర్లు వేశానని చెప్పారు. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎక్కడ చూసినా నీళ్లకు కొదవలేదన్నారు.