రూ.60లక్షల ఖర్చుతో జిల్లాకో గులాబీ భవన్

రూ.60లక్షల ఖర్చుతో జిల్లాకో గులాబీ భవన్

దసరా నాటికి రెడీ: సీఎం కేసీఆర్

ఒక్కో ఆఫీస్​ కట్టడానికి రూ. 60 లక్షల ఖర్చు

బిల్డింగ్ ప్లాన్​తోపాటు చెక్కులు అందించిన పార్టీ చీఫ్​

పైసలకు ఫికర్​లేదు.. పార్టీ ఫండ్​ రూ. 255 కోట్లున్నది

దానికి ప్రతినెలా రూ.75లక్షల వడ్డీ వస్తది

టీఆర్​ఎస్​ ముఖ్యుల భేటీలో కేసీఆర్​

జిల్లాలకు తానే వస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ

హైదరాబాద్, వెలుగు: దసరా నాటికి అన్ని జిల్లాల్లో టీఆర్​ఎస్​ ఆఫీస్​ల నిర్మాణాలు పూర్తి కావాలని ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్​ ఆదేశించారు. నిధుల కొరత లేదని, పార్టీ ఫండ్‌ రూ. 255 కోట్లు ఉందని, దీనికి నెలకు రూ. కోటి 75 లక్షల వడ్డీ వస్తుందని చెప్పారు. ‘‘పుష్కలంగా పైసలున్నయ్‌. ఫికర్‌ అవసరం లేదు. ఇన్ని జిల్లాల్లో పార్టీ బిల్డింగ్​లు వందేండ్లు నిలిచేలా గట్టిగా ఉండాలె. అందులో అన్ని సౌలత్‌లు ఉండాలె’’ అని టీఆర్​ఎస్​ ముఖ్య నేతలకు సూచించారు. జిల్లాల్లో టీఆర్​ఎస్​ ఆఫీసుల నిర్మాణంపై బుధవారం తెలంగాణభవన్​లో ఆయన చర్చించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడికి వచ్చిన కేసీఆర్​.. నేతలతో గంటా పదిహేను నిమిషాలపాటు భేటీ అయినట్లు సమాచారం. పార్టీ బిల్డింగ్స్​ నిర్మాణం కోసం ఒక్కో జిల్లాకు రూ. 60 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆఫీసులన్నీ ఒకే నమూనాలో ఉండాలని మ్యాపులను, డిజైన్లను చూపించారు. అనంతరం నాయకులను ఉద్దేశించి సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘మన పార్టీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో బయటవాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు చూసి అంచనాకు రావాలె. పనులు వేగంగా పూర్తి చేయించండి” అని తెలిపారు. గ్రామాల నుంచి కార్యకర్తలు వస్తే జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో తమకు మంచి ఆఫీసు ఉందని అనుకోవాలని, వాళ్లు ఏదైనా పని మీద ఆగిపోతే రెస్టు రూంలో ఉండవచ్చనే
భరోసా వారికుండాలని సూచించారు. ‘‘కార్యకర్తలు వచ్చి పార్టీ ఆఫీసులో హాయిగా ఉండాలె.
రాత్రయితే ఆగి.. వచ్చిన పని చూసుకొని పోయేటట్లు ఉండాలె. అవసరమైతే బయటి రాష్ట్రాల నుంచి యంత్రాంగాన్ని తెచ్చుకొని పార్టీ ఆఫీసుల నిర్మాణం పూర్తి చెయ్యాలె’’ అని నేతలను ఆదేశించారు.

పటిష్టంగా చట్టాలు

రాష్ట్రంలో త్వరలో పటిష్టమైన మున్సిపాలిటీ చట్టం, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ చట్టం వస్తుందని కేసీఆర్​ తెలిపారు. ఇది అమలులోకి రాగానే పంచాయతీలకు, జెడ్పీ చైర్​పర్సన్లకు  అధికారాలు వస్తాయన్నారు. ఎవరు అవినీతికి పాల్పడ్డా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు తెస్తున్నట్లు చెప్పారు.

ఒక్కో ఆఫీసుకు రూ. 60 లక్షలు

జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం ఒక్కో జిల్లా ఇన్​చార్జ్​కు  రూ. 60 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్​ అందజేశారు. తొలుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావుకు సిద్దిపేట జిల్లా ఆఫీసు నిర్మాణం కోసం చెక్కును ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో టీఆర్​ఎస్​ ఆఫీసుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం మొత్తం 25 మంది ఇన్​చార్జులను నియమించారు. ఉమ్మడి వరంగల్​లోని ఐదు జిల్లాల పార్టీ కార్యాలయ నిర్మాణాల బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు అప్పజెప్పగా, మిగితా జిల్లాల బాధ్యతలను ఒక్కో నేతకు అప్పగించారు.