
హైదరాబాద్, వెలుగు: వానాకాలం మొదలయ్యే నాటికే కొండపోచమ్మ సాగర్ వరకు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసేలా సిస్టమ్‌ను రెడీ చేయాలని అధికారులను, ఇంజనీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులపై కొత్త రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలంలో గోదావరి నీటి వాడకంపై ఆదివారం ప్రగతి భవన్‌లో గోదావరి పరీవాహక ప్రాంతాల మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమీక్షించారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టునూ వాడుకునేందుకు అవసరమైన ప్లాన్‌ను రెడీ చేయాలని ఆయన సూచించారు. ప్రతి ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన ఓ అండ్ ఎం మాన్యువల్ రెడీ చేయాలన్నారు. కబ్జాదారుల నుంచి ఇరిగేషన్ భూములను రక్షించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలని, దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలని సీఎం ఆదేశించారు. (మొదటి పేజీ తరువాయి)
రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే ప్లాన్ చేపట్టాలన్నారు. చెరువులకు నీళ్ల చేరడానికి ఉన్న ఇబ్బందులపై మంత్రులు, అధికారులు రెండు, మూడు రోజుల్లో సమావేశం కావాలని సూచించారు. చెరువుల నుంచి రైతులు మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని, అధికారులు వారిపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని సీఎం అన్నారు. ఈ వానాకాలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలని ఆదేశించారు. ఎల్ఎండీ కింద కాకతీయ కాల్వ కెపాసిటీని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి అని సూచించారు.
మూడో టీఎంసీ పనులు పూర్తి చేయాలి
కాళేశ్వరంలో మూడో టీఎంసీ పనులను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకునేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్‌రావుపేట (జగిత్యాల జిల్లా)లో నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించాలన్నారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని సూచించారు. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలని ఆదేశించారు. ‘‘సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ.50 లక్షల వరకు.. ఎస్ఈ రూ.25 లక్షల వరకు.. ఈఈ రూ.5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు” అని చెప్పారు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ‘‘రాష్ట్రంలో చాలా చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమే కాదు ప్రమాదకరం కూడా. కాలువలపై నివాసం ఉండే వారిని వెంటనే ఖాళీ చేయించాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి” అని ఆదేశించారు.