ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు, నక్సలిజం, కాల్చిచంపడం తప్ప ఏముంది?: కేసీఆర్

 ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు, నక్సలిజం, కాల్చిచంపడం తప్ప ఏముంది?: కేసీఆర్

‘‘ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా చెబుతున్నరు.. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి చావులు, నక్సలిజం, కాల్చి చంపడాలు, అణిచివేతలు.. ఇందిరమ్మ రాజ్యం ఎవలికి కావాలె? పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్​వస్తే పదేండ్ల కష్టం బూడిదపాలైద్ది’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదని, ఉమ్మడి పాలమూరు జిల్లాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్(శాంతినగర్), కొల్లాపూర్, నాగర్​కర్నూల్, కల్వకుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్​ పాల్గొని మాట్లాడారు. 

పదేండ్ల కింద తెలంగాణ ఎట్ల ఉండేదో.. ఇప్పుడు ఎట్ల ఉందో చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల పొరపాటుతో 58 ఏండ్లు గోస పడ్డామని.. మళ్లీ అదే తప్పు చేయొద్దని సూచించారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పాలమూరు కూలీలే కనిపించే వారని, బీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిందన్నారు. కాంగ్రెస్ వస్తే పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు లెక్క అవుతుందన్నారు. 

వాల్మీకి బోయలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీసీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మండిపడ్డారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పట్టించుకోలేదన్నారు. ఈసారి కేంద్రం మెడలు వంచి ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులకు, గూండాగిరికి తావులేదని, మంచి చేసేవారికే ఓటు వేయాలని కోరారు. అన్ని పనులు పూర్తిచేసి అలంపూర్​కు కరువు లేకుండా చూస్తానని కేసీఆర్​హామీ ఇచ్చారు.

ఆర్డీఎస్ కోసం పోరాటం చేసింది నేనే

86 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ద్వారా 8 వేల ఎకరాలకు కూడా నీరు అందేది కాదని కేసీఆర్ చెప్పారు. 2002లో ఆర్డీఎస్​పై పోరాటం చేశానని గుర్తు చేశారు. అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశామని, రాష్ట్రం వచ్చాక తుమ్మిళ్ల లిఫ్టును కంప్లీట్ చేసుకొని 35 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నామన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుని మిగతా ఆయకట్టుకు నీరు ఇస్తామని, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు నెట్టెంపాడులోని 99వ,100వ ప్యాకేజీల పనులు కంప్లీట్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్​నేతలు ఉత్తమ్ కుమార్​రెడ్డి రైతుబంధు వేస్ట్ అని, రేవంత్​రెడ్డి మూడు గంటలు కరెంట్​చాలని చెబుతున్నారని రైతుబంధు, 24 గంటల కరెంట్ కావాలో.. వద్దో రైతులే ఆలోచించుకోవాలని కేసీఆర్ కోరారు. 

ఢిల్లీ నుంచి గద్దలు వస్తున్నయ్

ఎక్కడ చూసినా డాంబర్ రోడ్ల మీద వడ్ల కుప్పలు కనిపిస్తున్నాయని.. అందుకు కారణం మంత్రి హరీశ్​రావే అని కేసీఆర్​ చెప్పారు. కాల్వల వెంబడి తిరిగి, ఆడనే పండుకుని పూర్తిచేయించడంతోనే సాధ్యమైందన్నారు. కొల్లాపూర్​గుంపు మేస్త్రీలు, కూలీలను బొంబాయి బస్సులు ఎక్కించినప్పుడు, గంజి కేంద్రాలు పెట్టినప్పుడు, పక్కన కృష్ణమ్మ పోతున్నా తాగునీళ్ల కోసం తండ్లాడినప్పుడు ఈ లావు, పొడువు మాటలు మాట్లాడుతున్న లీడర్లు యాడికి పోయిండ్రని కేసీఆర్​నిలదీశారు. జొన్నలు, వడ్లు పండించే తెలివి లేదని ఎక్కిరించినోళ్లు సిగ్గుపడేలా ఇప్పుడు తెలంగాణలో వడ్లు పండిస్తున్నామన్నారు. 

రాహుల్ గాంధీ కొల్లాపూర్​దేనికొచ్చాడు? గడ్డి కోయనీకా? అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేయనందుకే జనం ఓడించారన్నారు. ‘హర్షవర్దన్​ రెడ్డి పాడు చేసింది ఏంది? జూపల్లి బాగుచేసింది ఏందని కేసీఆర్​ నిలదీశారు. కాంగ్రెస్​ను నమ్మితే వైకుంఠపాళిలో పెద్దపాము మింగినట్లేనని హెచ్చరించారు. తెల్లబడుతున్న తెలంగాణను ఎడారిగా మార్చేందుకే ఢిల్లీ నుంచి గద్దలు వాలుతున్నయని ధ్వజమెత్తారు. నాగర్​కర్నూల్​కు ఇంజినీరింగ్​కాలేజీ ఇస్తామని, కల్వకుర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ పాలన సక్కగుంటే టీడీపీ వచ్చేదా?

ఎవరు మనోళ్లో.. ఎవరు పరాయి వాళ్లో చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ ​కోరారు. తొందరపడితే ఆగమవుతారని చెప్పారు. 2004లో టీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్​కు పదేండ్లు ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని గుర్తుకు రాలేదన్నారు. పైగా టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కొని, పార్టీని చీల్చారని మండిపడ్డారు. ‘సావు నోట్లో తలపెట్టి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటే తప్ప దిగిరాలేదన్నారు. 50 ఏండ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ఏం చేసిందని ప్రశ్నించారు. 50 ఏండ్లలో గుక్కెడు తాగునీళ్లు ఇయ్యనోళ్లు మస్తు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఎన్టీఆర్​ టీడీపీ పెట్టి రూ.2 కే కిలో బియ్యం ఇచ్చేదాక తిండికి గతిలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంత సక్కగా ఉంటే టీడీపీ ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. ధరణి పోతే మళ్లీ ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినం. రైతు బంధు తెచ్చినం. రైతు బీమా ఇచ్చినం. పేదల కడుపు నిండేలా పెన్షన్లు ఇస్తున్నాం’ అని కేసీఆర్​చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే అన్ని ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

సీఎం సభలో సీటీల లొల్లి!

సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా అలంపూర్​ సభలో గొడవ జరిగింది. కొందరు ఈలలు, అరుపులు, కేకలు వేయడంపై కేసీఆర్ ఫైర్​ అయ్యారు. పలుమార్లు ‘సీటీలు బంద్ చేయండి రా బాబు..’, ‘అరే మల్ల అట్లే కొడతారు ఎవడ్రా వాడు. పిచ్చి లేసినట్లు అట్లా కొడుతున్నారు’, ‘ప్రజలకు నేను చెప్పేది తెల్వద్దా’ అంటూ సీరియస్ అయ్యారు. అయినా ఈలలు, కేకలు వేయడం ఆగలేదు. మహిళల గ్యాలరీలోకి కొందరు తాగుబోతులు వచ్చి సిటీలు కొడుతూ.. కుర్చీలు పైకెత్తి గలాటా చేశారు. మహిళలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. సీఎం స్పీచ్ ముగిసేవరకు గోల, తోపులాట, అరుపులు, కేకలు కొనసాగాయి.