IND vs SA: టీమిండియా బౌలర్లు అదరహో.. 117 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

IND vs SA: టీమిండియా బౌలర్లు అదరహో.. 117 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు దుమ్ములేపారు. రెండో టీ20లో లోపాలను అధిగమించి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్కరం 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్,అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబేలు తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఘోరమైన ఆరంభం లభించింది. టీమిండియా పేసర్లు హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ ధాటికి సఫారీ బ్యాటర్లు వరుస బెట్టి పెవిలియన్ చేరారు. తొలి ఓవర్లో రీజా హెండ్రిక్స్ ను అర్షదీప్ ఔట్ చేసి అదిరిపోయే శుభారంభం ఇచ్చాడు. రెండో ఓవర్లో హర్షిత్ రానా గత మ్యాచ్ సెంచరీ హీరో క్వింటన్ డి కాక్ ను పెవిలియన్ కు చేర్చాడు. నాలుగో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ ను హర్షిత్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా 7 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా తొలి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసింది. 

పవర్ ప్లే తర్వాత స్టబ్స్ (9) ను హార్దిక్ పాండ్య ఔట్ చేయడంతో 30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దూబే తన తొలి ఓవర్ లోనే ఒక స్టన్నింగ్ డెలివరీతో బాష్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సఫారీలు 44 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. డోనోవన్ ఫెర్రీరా 20 పరుగులు చేసి పర్వాలేదనిపించినా క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ కూడా చేయలేకపోయింది. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మార్కరం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టు స్కోర్ ను 100 పరుగులు దాటించాడు.