సీఎం కేసీఆర్ పోరాటానికి సీపీఎం మద్దతు

సీఎం కేసీఆర్ పోరాటానికి సీపీఎం మద్దతు

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో మతం పేరుతో ప్రజల మధ్య విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు మద్దతు ఇచ్చిన లెఫ్ట్‌‌‌‌ పార్టీ లీడర్లకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ధన్యవాదాలు తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌‌‌‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. రాజకీయ, జాతీయ అంశాలపై వీరు సుమారు గంటపాటు చర్చించారు. విచ్ఛిన్నకర శక్తులు తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. వీరి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు ప్రజాపక్షం వహించే రాజకీయవేత్తలు కదలిరావాలని తానిచ్చిన పిలుపునకు స్పందించి, మద్దతు ప్రకటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.

మత విద్వేష శక్తులకు ఎదుర్కునేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గ సమస్యలూ చర్చకు వచ్చినట్లు భేటీ తర్వాత మీడియాతో తమ్మినేని అన్నారు. మళ్లీ ఈ నెల 8, 9 తేదీల్లో పిలుస్తామన్నట్లు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పారని వెల్లడించారు.