- నా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారు
- నేను నివసించకున్నా గోడకు నోటీసులు ఎట్లా అంటిస్తరు?
- ప్రస్తుతం నివసించే చోటే నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు తీర్పున్నది
- కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పోలీస్ అధికారిపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ సూచించినట్టు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. సిట్ విచారణకు జనవరి 30న హాజరు కావాలని జనవరి 29న కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లున్న నేపథ్యంలో హాజరు కాలేనని, వేరే రోజున విచారణ తేదీ ఫిక్స్చేయాలని, ఎర్రవల్లిలోని తన ఇంటికే (ఫాంహౌస్) విచారణకు రావాలని సిట్‌కు అదే రోజు కేసీఆర్ లేఖ రాశారు. కానీ, ఎర్రవల్లిలో కుదరదని, నందినగర్‌లోనే విచారణ ఉంటుందని పేర్కొంటూ శుక్రవారం (జనవరి 30) నందినగర్లోని ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్పందించారు.
శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో లీగల్ ఎక్స్పర్ట్స్, కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కోర్టుకు వెళ్లే విషయంపైనా చర్చించారు. చివరకు విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కానీ, సిట్తీరు ఏమాత్రం బాగాలేదని, ఓ మాజీ సీఎం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సిట్ ఏసీపీ పి. వెంకటగిరికి ఆరు పేజీల లేఖను రాశారు. తన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారని, విచారణకు హాజరవుతానని చెప్పారు. కాగా, కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు.
చట్టాన్ని.. సుప్రీంతీర్పులను తుంగలో తొక్కిన్రు
చట్టాన్ని, సుప్రీంతీర్పులను సిట్ఉల్లంఘించిందని, 65 ఏండ్లు దాటిన వ్యక్తులు తాము నివసించే చోట విచారణకు హాజరయ్యే హక్కును క్రిమినల్ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్160 ఇచ్చిందని లేఖలో కేసీఆర్పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లిలోనే నివసిస్తున్న నేపథ్యంలో.. అక్కడికే విచారణకు రావాలని కోరానని.. కానీ, దానిని సిట్బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు.
‘‘శుక్రవారం రాత్రి 9గంటల ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నందినగర్లోని ఇంటికి వెళ్లి మీ సంతకం ఉన్న నోటీసులను గోడకు అంటించారు. అది మీ సంతకమే అయితే.. మీ ఆదేశాల ప్రకారమే గోడకు నోటీసులు అంటించి ఉంటే దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ తీరు చూస్తుంటే రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేనట్టు కనిపిస్తున్నది. విచారణ చేయాలంటే ముందుగా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులివ్వాలని చెప్పింది. 65 ఏండ్లు దాటిన వాళ్లయితే సెక్షన్ 160 ప్రకారం వాళ్లు కోరుకున్న చోట విచారణ జరిపించాలని తీర్పునిచ్చింది. నోటీసులు కూడా నేరుగా సదరు వ్యక్తి నివసించే చోటే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, మీరు సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్టు కనిపిస్తున్నది. తద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఎర్రవల్లిలోనే ఉంటున్నాను కాబట్టి భవిష్యత్‌లో ఇచ్చే నోటీసులన్నీ అక్కడే ఇవ్వాలని తాను కోరినా.. మీరు పట్టించుకోలేదు. ఈ లెక్కన మీరు ఇచ్చిన నోటీసులు అక్రమం, చట్ట విరుద్ధం. అలాంటి నోటీసులను నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
నేను మీ స్టేషన్ లిమిట్స్‌లో ఉంటలేను..
ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో తాను నివసించడం లేదని, అలాంటప్పుడు ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన అడ్రస్ ప్రకారమే నోటీసులు ఇచ్చామని సిట్ చెప్పడం కరెక్ట్ కాదని కేసీఆర్ చెప్పారు. సెక్షన్ 160కి, ఎన్నికల అఫిడవిట్ లేదా అసెంబ్లీ రికార్డ్స్‌లోని అడ్రస్‌లకు అసలు సంబంధమే లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 65 ఏండ్లు దాటిన వ్యక్తులు విచారణ టైమ్ నాటికి లేదా నోటీసులు సర్వ్ చేయాల్సిన టైమ్ నాటికి ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్‌నే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
కానీ, మీరు వాటిని పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ పీఎస్ లిమిట్స్‌లోని నందినగర్లోని ఇంటి వద్దే విచారణ చేస్తామన్నారని ఆక్షేపించారు. అదే సమయంలో ఎన్నికల అఫిడవిట్‌నే పరిగణనలోకి తీసుకుంటే హరీశ్ రావు చిరునామా సిద్దిపేట టౌన్లో ఉంటుందని.. కానీ, ఆయన్ను విచారణకు పిలిచినప్పుడు మాత్రం హైదరాబాద్‌లోని ఇంటి వద్ద నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది సిట్అధికారుల ద్వంద్వ తీరుకు అద్దం పడుతున్నదని చెప్పారు.
గోడకు నోటీసులు అంటించడమేంటి..
పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల ప్రకారం తాను నివసించని ఇంటి గోడకు నోటీసులు అంటించడం అక్రమమని కేసీఆర్ పేర్కొన్నారు. తాను కోరినట్టు ఎర్రవల్లిలో విచారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సిట్ అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. కానీ, ఓ మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా తాను డిపార్ట్మెంట్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, నందినగర్లోని ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు.
