
- ఎండిన పొలాలను పరిశీలించనున్న బీఆర్‌ఎస్ చీఫ్
- సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం
- ప్రతిపక్ష నాయకుడిగా నేరుగా జనంలోకి తొలిసారి
- రేపు నల్గొండలో పార్లమెంట్ విస్తృత స్థాయి మీటింగ్‌కు కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నీటి ఎద్దడితో ఎండుతున్న పొలాలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సిద్ధమయ్యారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆదివారం ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని ఎండిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లంచ్ చేసి, 3 గంటలకు అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో పొలాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫామ్‌హౌజ్‌కు వెళ్లనున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల్లోకి వస్తున్న తొలి కార్యక్రమం ఇదే. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫిబ్రవరిలో నల్గొండలో సభకు, మార్చిలో కరీంనగర్ సభకు అటెండ్ అయినప్పటికీ, నేరుగా సభకు హాజరై వెళ్లిపోవడం తప్ప ప్రజలను కలవలేదు. ఈసారి పొలాలను పరిశీలించి, రైతులతో ఆయన మాట్లాడుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపు కేటీఆర్ పార్లమెంట్ మీటింగ్
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్విస్తృత స్థాయి సమావేశం సోమవారం ఉదయం 11గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. ఈ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.