కొడుకును సీఎం చేసి ఢిల్లీ పోవాలని కేసీఆర్ ప్లాన్

కొడుకును సీఎం చేసి ఢిల్లీ పోవాలని కేసీఆర్ ప్లాన్

సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని విమర్శించారు.  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని గ్రావిటీ తరలించకుండా.. కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండని వివేక్ ఆరోపించారు. పోలీసుల ద్వారా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. కొడుకును సీఎం చేసి తాను ఢిల్లీ వెళ్లే ప్లాన్ వేస్తున్న కేసీఆర్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి టీఆర్ఎస్ భరతం పట్టాలని పిలుపునిచ్చారు.

అంతకు ముందు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్మికులను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కెన్యూటెక్ గని ప్రమాదంలో గాయపడిన సురేష్, శ్రీనివాస్లకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సింగరేణి మైన్స్లో రక్షణ చర్యలపై యాజమాన్యం దృష్టి పెట్టడం లేదని, ఇందుకోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఇంటర్నేషనల్ సేఫ్టీ విధానాలు అమలు చేయాలని అన్నారు. నిధులున్నా రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ లో వసతులు కల్పించకపోవడంపై వివేక్ వెంకటస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.