నా రాజీనామాపై ప్రజలతో చర్చించండి
మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్ లీడర్లతో ఎమ్మెల్యే మీటింగ్
నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక చారిత్రక అవసరమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక వస్తే తప్ప.. సీఎం కేసీఆర్ ఫండ్స్ ఇవ్వరని చెప్పారు. బుధవారం హైదరాబాద్ లో మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్ మండలాల లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. ఉప ఎన్నికతో మునుగోడుకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, తన రాజీనామాతో నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని, వాళ్లు రాజీనామా చేయాలని కోరుకుంటే దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘‘నేను పార్టీ మారడం మీకు ఇష్టం ఉండొకపోవచ్చు. కానీ ఇదే విధంగా 20 ఏండ్లు అపోజిషన్ లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకో ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగినా పెద్దగా ఉపయోగం ఉండదు. అదే రాజీనామా చేస్తే నియోజకవర్గానికి దళిత బంధు రాకున్నా.. కనీసం కొత్త పింఛన్లయినా వస్తాయి” అని అన్నారు. లీడర్లు చెబితే జనాలు ఓట్లు వేసే రోజులకు కాలం చెల్లిందని, ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప గెలవలేమని.. కాబట్టి ప్రజల్లోకి వెళ్లి తన రాజీనామా గురించి చర్చించాలని నాయకులకు సూచించారు.
పార్టీ మారినా నన్నెమీ చేయలేరు..
పదవులు త్యాగం చేయడం తనకేం కొత్త కాదని, సీఎం కేసీఆర్ హవా కొనసాగుతున్న రోజుల్లోనే ఎమ్మెల్సీగా గెలిచానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. 2009 ఎన్నికల్లో మహాకూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతోనే భువనగిరి ఎంపీగా తాను పోటీ చేశానని, దాంతోనే పార్టీకి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం చేసిన పొరపాట్ల వల్ల తాను ఎంపీగా ఓడిపోయానన్నారు. ‘‘నేను ఇప్పుడు పార్టీ మారినా నన్నెవరూ ఏమీ చేయలేరు. ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుంది?” అని ఆయన ప్రశ్నించారు. కాగా, గురువారం చౌటుప్పుల్ లీడర్లలో రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు.
