నీ కౌంట్​డౌన్​ స్టార్టయింది

నీ కౌంట్​డౌన్​ స్టార్టయింది
  • అన్ని రాష్ట్రాలు పెట్రోల్​పై వ్యాట్​ తగ్గించినా 
  • తెలంగాణలో ఎందుకు తగ్గించలే?
  • ఎనిమిదేండ్ల టీఆర్​ఎస్​ పాలనలో చేసిందేంది?
  • రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో లెక్కతో మేం చర్చకు సిద్ధం
  • కేసీఆర్ కు దమ్ముంటే ప్లేస్, డేట్ చెప్పాలని సవాల్​
  • ‘‘సాలు దొర...సెలవు దొర’’ వెబ్ సైట్  ప్రారంభం
  • వచ్చే నెల 1 న నడ్డా, 2న మోడీ హైదరాబాద్ రాక

హైదరాబాద్, వెలుగు:  కేసీఆర్​కు వీడ్కోలు పలికే టైమ్​ వచ్చిందని, రాష్ట్రంలో జంతర్​ మంతర్​ తాంత్రిక్​ సర్కార్​ నడుస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​ చుగ్  అన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్​ఎస్​ పాలనలో చేసిందేమిటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు.‘‘కేసీఆర్... ఇక గద్దె దిగు. నీకు వీడ్కోలు పలికే టైమ్​ వచ్చింది. బై బై కేసీఆర్. ఇప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక నీవు అధికారంలో ఉండేది కేవలం 529 రోజులే. అందుకే ‘సాలు దొర...సెలవు దొర’ వెబ్​సైట్​ను తెస్తున్నం” అని తరుణ్​చుగ్​ తెలిపారు.శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్ సైట్ ను ప్రారంభించారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని, కేసీఆర్, ఆయన కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదని తరుణ్​ చుగ్​ అన్నారు. ‘‘బంగారు తెలంగాణ అన్నడు.. కానీ ఆయన కుటుంబం మాత్రమే బంగారం అయింది” అని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.  ‘‘దేశంలో అన్ని రాష్ట్రాలు పెట్రోల్​పై వ్యాట్​ తగ్గించాయి. కేసీఆర్ మాత్రం తగ్గించడం లేదు. ఎందుకు తగ్గించడం లేదు? నిద్రపోతున్నడా?” అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు.. అలీబాబా 40 మంది దొంగలు మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ ఏం చేశారు. రుణ మాఫీ అమలులో, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఫెయిలయ్యారు. యువకులకు, దళితులకు, మహిళలకు, నిరుపేదలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకుండా కేసీఆర్ ఏం చేశారు?” అని తరుణ్​ చుగ్​ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ఇక గద్దె దిగు.. బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది” అని అన్నారు. ఈ విషయాన్ని తాము కేసీఆర్​కు రోజూ  గుర్తు చేస్తూనే ఉంటామని, దీనిపై ప్రతి ఇంటికి ప్రజా సంగ్రామ యాత్ర వెళ్తుందని, ఇంటింటికి బూత్ స్థాయి కార్యకర్తలు వెళ్తారని చెప్పారు. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు మోడీ వస్తున్నారన్న టీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందిస్తూ... ‘‘మేము తెలంగాణకు ఏమిచ్చామో లెక్కలతో సహా వస్తాం. కేసీఆర్​కు దమ్ముంటే ప్లేస్, డేట్ చెప్పమనండి.. మేం చర్చకు సిద్ధం” అని సవాల్​ విసిరారు. 

1 న నడ్డా, 2న మోడీ హైదరాబాద్ రాక

వచ్చె నెల 2న బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశం ఉంటుందని, అదేరోజు సాయంత్రం ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకుంటారని తరుణ్​ చుగ్​ చెప్పారు. బీజేపీ జాతీయ  అధ్యక్షుడు జేపీ నడ్డా 1న హైదరాబాద్ వస్తారని, 2, 3 తేదీల్లో హైదరాబాద్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశాల్లో కేంద్ర కేబినెట్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వస్తున్నారని, మొత్తం 340 మంది నేతలు  హాజరవుతున్నారని వెల్లడించారు. 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ భారీ సభ ఉంటుందన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ సభ కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, హైదరాబాద్​లోని పాతబస్తీకి యూపీ సీఎం యోగిని తీసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చినప్పుడు ఓల్డ్ సిటీలోని  భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి రావాలని యోగిని లేఖలో కోరినట్లు ఆయన చెప్పారు. అయితే యోగి నుంచి రిప్లై రావాల్సి ఉందన్నారు. 

బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చిన ఏపీ నేతలు

వచ్చే నెల 4న ఏపీలోని భీమవరంలో అల్లూరి  సీతరామరాజు జయంతోత్సవాల్లో మోడీ పాల్గొననున్నందున ఆ ప్రోగ్రామ్​కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించేందుకు శనివారం ఏపీ బీజేపీ నేతలు హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీసుకు వచ్చారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్.. కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. 

టీచర్లపై కక్ష సాధిస్తున్నది: సంజయ్ 

ప్రభుత్వ టీచర్లు ఇక నుంచి ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర సర్కార్​ సర్క్యులర్ జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మండిపడ్డారు. ఇది టీచర్లపై కక్షసాధింపు చర్యల్లో భాగమేనన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేసీఆర్ తీసుకున్న  పిచ్చి తుగ్లక్ నిర్ణయాల్లో ఇదొకటని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఆస్తులను వెల్లడించే ధైర్యముందా?” అని ఆయన సవాల్​ చేశారు. ‘‘టీచర్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు హస్యాస్పదంగా ఉన్నాయి. తీవ్రంగా ఖండిస్తున్నాం” అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ  లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్లతో పాటు విద్యాశాఖలో పని చేస్తున్న వాళ్లను కేసీఆర్ దొంగల్లా చూస్తున్నారని విమర్శించారు. 

జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై చర్చ

వచ్చే నెల 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు, మోడీ సభకు జన సమీకరణపై తరుణ్ చుగ్ పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, నేతలు మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.