
కర్నాటక ఫలితాల తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ కు భారీ దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ అంసతృప్తితో ఉన్న కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఓ బృందం ప్రత్యేకంగా పనిచేస్తోందని సమాచారం. ఓ వైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచకుళ్ల దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కేసీఆర్.. బీఆర్ఎస్ ఏకంగా ఓ సిట్టింగ్ ఎంపీకి, ఇద్దరు ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వాళ్లతో టాక్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం. తన సెగ్మెంట్లో పీసీసీ చీఫ్ రహస్యంగా ఓ సర్వే చేయించారని, తాను ఓడిపోతానని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయిస్తున్నారని సదరు ఎంపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనకు సమాచారం ఇవ్వకుండా తమ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీలో చేరక ముందే పరేషాన్ చేస్తున్నారంటూ ఆయన బహిరంగ విమర్శలే చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం. సదరు ఎంపీని బీఆర్ఎస్ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వీరితో పాటు దక్షిణ తెలంగాణలోని కీలక నేతలతో మంత్రి హరీశ్ రావు టచ్ లోకి వెళ్లారని సమాచారం. వాళ్లందరితో ప్రాథమికంగా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. కండువాలు మార్చుకొనేందుకు మూహూర్తం ఒక్కటే ఫిక్స్ కావాల్సి ఉందని సమాచారం.
కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ నేతల చూపు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న షరతుతోనే హస్తం గూటికి చేరుతున్నట్టు టాక్. గులాబీ పార్టీకి చెందిన 10 మంది కీలక నేతలు కారుదిగేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లంతా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వీళ్లలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉండటం విశేషం. వీళ్లంతా రకరకాల చానళ్ల ద్వారా హస్తం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
గులాబీ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్
దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ లోని కొన్ని జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులతోనూ బీఆర్ఎస్ పెద్దలు సంప్రదించారని సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్ కోసం పది మంది నేతలతో కూడిన టీం బీఆర్ఎస్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను కారెక్కించుకునేందుకు రకరకాల ఆఫర్లు చేసినట్టు తెలిసింది. పొంగులేటి, జూపల్లి, కూచకుళ్ల తదితర నేతల చేరిక తర్వాత కాంగ్రెస్ లో బిగ్ బాంబ్ పేల్చేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉంటూ గత కొంతకాలంగా సైలెంట్ అయిన పలువురు కీలక నేతలపై అనుమానాలు మొదలయ్యాయి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, మీడియా ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ ముఖ్యనేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.