దోచుకున్న డబ్బుతోనే విమానం కొంటున్నడు: కిషన్ రెడ్డి

దోచుకున్న డబ్బుతోనే విమానం కొంటున్నడు: కిషన్ రెడ్డి
  • రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మునుగోడు, వెలుగు: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్నేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. దోచుకున్న డబ్బుతోనే విమానం కొంటున్నాడని అన్నారు. ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమకారులను బయటకు పంపిన కేసీఆర్.. ఇప్పుడా పార్టీ పేరులో తెలంగాణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆదివారం మునుగోడు మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

కృష్ణాపురం, పలివెల, కచలాపురం, మునుగోడు తదితర గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తున్నది. ఆనాడు రజాకార్లను కారం ముద్దలు, రోకలి బండలతో తరిమికొట్టిన నల్గొండ ప్రజలు.. ఇప్పుడదే స్ఫూర్తితో కేసీఆర్​ను తరిమికొట్టాలి” అని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగం చేసింది కేసీఆర్ కుటుంబం చేతుల్లో పెట్టడానికేనా? ఉద్యమం టైమ్ లో నాకు ఎలాంటి పదవులు వద్దని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక కొడుకు, బిడ్డ, అల్లుడికి పదవులు కట్టబెట్టారు.

రాష్ట్రం వస్తే ఉద్యోగాలోస్తాయనుకున్న యువత ఆశలను అడియాసలు చేశారు” అని మండిపడ్డారు. ‘‘అమరుల త్యాగాలను వృథా కానివ్వొద్దు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీకి పట్టం కట్టాలి.  మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పాలి. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు బీజేపీని గెలిపించాలి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది మునుగోడు ప్రజలే. కుటుంబ పాలన కావాలో? ప్రజాస్వామ్య పాలన కావాలో? తేల్చుకోవాలి” అని సూచించారు.  

ఇన్నేండ్లు మునుగోడు కనబడలేదా? 

మంత్రి కేటీఆర్​కు ఇన్నేండ్లు మునుగోడు నియోజకవర్గం కనిపించలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసమే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మాఫియా పార్టీలాగా మారిందని, ధరణి పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించుకుంటోందని ఆరోపించారు.

‘‘ప్రధానిగా మోడీ, సీఎంగా కేసీఆర్ ఒకేసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. కానీ కేసీఆర్ సెక్రటేరియట్​కు రాకుండా ఫామ్ హౌస్​లోనే ఉంటున్నారు” అని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో ఎంతోమంది పేదలకు సేవ చేశారని, ఉప ఎన్నికలో ఆయనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.

పలివెల గ్రామంలో ఉద్రిక్తత..  

పలివెల గ్రామంలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న తమ వాహనంలో టీఆర్ఎస్ కళా బృందం ప్రదర్శనలు ఇచ్చింది. పోలీసులు వచ్చి టీఆర్ఎస్ కళాకారులకు నచ్చజెప్పినా వాళ్లు వినలేదు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కళాబృందం అడ్డుతగిలినా కిషన్ రెడ్డి ఎంతో ఓపికతో తన ప్రసంగాన్ని కొనసాగించారు.