ENG vs WI: వెస్టిండీస్‌కు దొరికిన ఆణిముత్యం.. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు బాదిన కార్టీ

ENG vs WI: వెస్టిండీస్‌కు దొరికిన ఆణిముత్యం.. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు బాదిన కార్టీ

వెస్టిండీస్ యువ బ్యాటర్ కీసీ కార్టీ వన్డే క్రికెట్‌లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆదివారం (జూన్ 1) కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు. 105 బంతుల్లో 13 ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కార్టీకి చివరి నాలుగు మ్యాచ్ ల్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా ఈ విండీస్ నయా సంచలనం వన్డే కెరీర్ లో ఇది నాలుగో సెంచరీ. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ప్రారంభంలో జ్యువెల్ ఆండ్రూ డకౌటైనా.. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (59) తో కలిసి కార్టీ రెండో వికెట్ కు 141 పరుగుల భారీ భాగస్వామ్యంతో విండీస్ జట్టును నిలబెట్టాడు. 

ALSO READ | IND vs ENG: టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే లక్కీ ఛాన్స్.. ఐదుగురు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు గాయాలు

గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కార్టీ వరుసగా వన్డే సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో విఫలమైనా..  రెండో వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు చేశాడు. చివరి వన్డేలో 142 బంతుల్లో 170 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి వన్డేల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేల్లో మాత్రం సెంచరీతో చెలరేగాడు. విండీస్ జట్టులో 50 యావరేజ్ తో పరుగులు చేసి కార్టీ దూసుకెళ్తున్నాడు. కార్టీ 2022న నెదర్లాండ్స్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. ఓవరాల్ గా 36 వన్డే మ్యాచ్‌ల్లో 50.11 సగటుతో 1,403 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయింది. కీసీ కార్టీ  105 బంతుల్లో 13 ఫోర్లతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (59) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ప్రస్తుతం 33 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  రూట్ (86), విల్ జాక్స్ (26) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే చివరి 17 ఓవర్లలో 124 పరుగులు చేయాలి.