- చరిత్రను వక్రీకరిస్తున్నందునే కేరళలో ‘ఎన్ఈపీ’కి నో
- కేంద్రం ఇచ్చే నిధులు భిక్ష కాదు.. రాష్ట్రాల హక్కు
- మా దగ్గర డ్రాపౌట్స్ లేవు.. 100 శాతం లిటరసీ ఉంది
- కేరళను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తం
- ‘వీ6 వెలుగు’ తో కేరళ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి బిందు
హైదరాబాద్, వెలుగు: దేశంలో విద్యా వ్యవస్థను కాషాయీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్.బిందు ఆరోపించారు. రాష్ర్టాల్లో విద్యకు తగినన్ని నిధులు ఇవ్వకుండా సమైక్య స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కేంద్రం పెడుతున్న భిక్ష కాదని, అది రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టంచేశారు. కేరళను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే తమ ఎల్డీఎఫ్ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
దీంట్లో భాగంగా విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా స్టడీ ఇన్ కేరళ స్కీమ్ ప్రారంభించామని తెలిపారు. దేశంలోని అన్ని రంగాలను పూర్తిగా కమ్యూనలైజేషన్, కమర్షియలైజేషన్, సెంట్రలైజేషన్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఐద్వా జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆర్.బిందు.. ‘వీ6 వెలుగు’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేరళ విద్యా విధానం, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆమె మాట్లాడారు. ‘‘కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లో విద్యాపరమైన సంస్కరణల కన్నా రాజకీయ అజెండానే ఎక్కువగా కనిపిస్తోంది.
మన దేశ బలం ‘భిన్నత్వంలో ఏకత్వం’. కానీ కేంద్రం అందరిపై ఒకే మూస పద్ధతిని రుద్దాలని చూస్తోంది. ముఖ్యంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. సిలబస్ నుంచి మొఘల్ చరిత్రను తొలగించడం ద్వారా మన మూలాలను దెబ్బతీస్తున్నది. శాస్త్రీయ దృక్పథాన్ని పక్కనపెట్టి, భావజాలాన్ని నూరిపోసేలా పాఠాలు మారుస్తున్నారు. అందుకే సెక్యులర్ విలువలను కాపాడేందుకు మేము ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నాం” అని బిందు చెప్పారు.
నిధుల విడుదలలో కేంద్రం సహకారం ఎలా ఉంది?
బిందు: రూసా, పీఎం-ఉషా వంటి పథకాలకు కూడా నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతున్నది. కేంద్రం 60:40 నిష్పత్తిలో నిధులు ఇస్తున్నట్టు చెబుతోంది. దీంట్లో 40 శాతం రాష్ర్టాలే భరిస్తున్నాయి. అయితే, రాష్ర్టాలకు రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వడం లేదు. మేము ప్రాజెక్టులు పూర్తి చేసినా నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చే నిధులు ఏమీ భిక్ష కాదు. అది రాష్ట్రాల హక్కు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల వాటా ఇవ్వడం కేంద్రం బాధ్యత. కేంద్రం సరిగా నిధులు ఇవ్వకపోయినా.. మా వద్ద డ్రాపౌట్స్ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించి విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఎన్ఈపీని వ్యతిరేకిస్తూనే.. ప్రైవేట్ వర్సిటీలను ఆహ్వానించడం ఏంటి?
బిందు: ఇది ద్వంద్వ వైఖరి కాదు, వాస్తవ దృక్పథం. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతోంది. అన్ని రాష్ర్టాల్లో ప్రైవేటు వర్సిటీలు వచ్చేశాయి. ఒక్క కేరళలోనే లేవు. మా పిల్లలు వెనుకబడకూడదనే ఉద్దేశంతోనే ప్రైవేట్ వర్సిటీలను తేవాలని నిర్ణయించాం. విదేశాల్లో ఉన్న మళయాళీ మేధావుల మేధస్సు, పెట్టుబడులను ఇక్కడికి రప్పించడమే మా లక్ష్యం. అయితే, ఇక్కడ ప్రైవేట్ వర్సిటీలు వచ్చినా మా నిబంధనలు పక్కాగా ఉంటాయి.
సామాజిక న్యాయం, రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాసైంది కానీ.. ఏడాది కాలంగా ఈ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. ఆయన సంతకం పెడితే వచ్చే ఏడాదే ప్రారంభమవుతాయి. రిజర్వేషన్లు, సీట్లు, ఫీజులు ఇలా అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమాలు అమలు చేయాల్సిందే.
కేరళలో ప్రవేశపెట్టిన నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ప్రత్యేకత ఏంటి?
బిందు: చాలా మంది ఇది ఎన్ఈపీలో భాగం అనుకుంటారు. కానీ కాదు. ఇది మా సొంత 'కేరళ మోడల్'. విదేశాల్లో పీజీ చేయాలంటే 16 ఏళ్ల ఎడ్యుకేషన్ ఉండాలి. మన దగ్గర మూడేళ్ల డిగ్రీ చదివిన పిల్లలు విదేశాల్లో ఇబ్బంది పడుతున్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4 ఏళ్ల డిగ్రీని తెచ్చాం. ఎన్ఈపీలో ఉన్నట్టు రెండేండ్ల పాటు మధ్యలో మానేస్తే సర్టిఫికెట్ ఇచ్చే 'ఎగ్జిట్' ఆప్షన్లు మా దగ్గర లేవు. మూడేండ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగేండ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ ఇస్తాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గం.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
బిందు: కేరళలో డ్రాపౌట్స్ అసలే లేవు. వంద శాతం అక్షరాస్యత రీచ్ అయ్యాం. ఉన్నత విద్యలో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 53 శాతం మంది అమ్మాయిలు చదువుతున్నారు. క్యాంపస్‌లలో పూర్తి భద్రత కల్పిస్తున్నాం. స్కూల్ నుంచి వర్సిటీల వరకూ అన్ని స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశాం. మా హాస్టళ్లు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లోనూ ఫీజులను ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. సామాన్యుడికి కూడా ఉన్నత విద్య అందాలన్నదే మా ప్రభుత్వ పాలసీ.
