
తిరువనంతపురం: కేరళలో మరోసారి నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా పాలక్కాడ్ జిల్లాలో రెండో కేసు వెలుగుచూసింది. నిఫా వైరస్ సోకి మన్నర్కాడ్ సమీపంలోని కుమారంపుత్తూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పెరింతల్మన్నలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్యం క్షీణించి ఆదివారం (జూలై 13) మృతి చెందగా.. వైద్యపరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజుల వ్యవధిలోనే రెండు కేసులు వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మృతులతో సంబంధం ఉన్న వారిని గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు.
నలభై ఆరు మందిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచినట్లు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిఫా వైరస్ మళ్లీ చాపకిందనీరులా విజృంభిస్తుండటంతో పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు వైద్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిఫా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రతిస్పందన బృందాలను స్పీడప్ చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి వీణా జార్జ్.
పాలక్కాడ్ జిల్లాలో రెండవ నిఫా కేసు వెలుగు చూడటంతో 6 జిల్లాల్లోని ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వీణా జార్జ్ తెలిపారు. జ్వరం, ఎన్సెఫాలిటిస్, హై-గ్రేడ్ జ్వరంతో సహా ఏవైనా నిఫా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిఫా వైరస్ సోకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఆసుపత్రికి ఎక్కువగా రావొద్దని హెచ్చరించారు. ఒక రోగితో పాటు ఒక వ్యక్తిని మాత్రమే అటెండర్‌గా అనుమతిస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా మాస్కులు ధరించాలని సూచించారు.
నిఫా వైరస్ సంకేతాలు, లక్షణాలు:
నిఫా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉన్నాయి. ఈ లక్షణాలతో పాటు మైకం, మగత, నాడీ సంబంధిత సంకేతాలు, 24-48 గంటల్లో కోమాకు దారితీయవచ్చు. నిఫా వైరస్ వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది. అలాగే, నిఫా ఇన్ఫెక్షన్ అనేది ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు). ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, నిఫా వైరస్ సంక్రమణ వల్ల అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛలు, కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీస్తుంది.