
లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత రంజిత్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోమవారం ఆగస్ట్ 27న ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. IPC 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన రంజిత్..కేరళ చలనచిత్ర అకాడమీ అధినేత పదవికి రాజీనామా చేశారు.
మలయాళ సినిమాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, జరుగుతున్న దాడులను ఇటీవలే జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం చేసింది. ఈ నివేదిక విడుదలైన నేపథ్యంలో, బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా గత వారం మీడియాతో మాట్లాడుతూ..2009లో పాలెరి మాణిక్యం మూవీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో రంజిత్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
ఇలా హేమ కమిటీ నివేదిక విడుదల అనంతరం పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. దీంతో హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత వచ్చిన ఆరోపణలపై..సమగ్ర విచారణ జరిపేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసును అప్పగించనున్నారు.