- కేరళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. పసికందును రక్షించిన సిబ్బంది
అలప్పుజ (కేరళ): కడుపునొప్పితో హరిపాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన 19 ఏళ్ల అవివాహిత యువతి, టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చి కిటికీలోంచి బయటకు విసిరేసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కడుపునొప్పికి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన సదరు యువతి శారీరక పరీక్షకు నిరాకరించడంతో ఆమె గర్భవతి అయి ఉండవచ్చని అనుమానించినట్లు వైద్యులు తెలిపారు. పర్యవేక్షణలో ఉన్న సమయంలో ఆ యువతి చాలాసార్లు టాయిలెట్‌కు వెళ్లడాన్ని గమనించామని తెలిపారు.
ఆమె టాయిలెట్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే లోపలి నుంచి ఒక బలహీనమైన ఏడుపు వినిపించిందని పేర్కొన్నారు. దీంతో వైద్య బృందం, సిబ్బంది అప్రమత్తమై చుట్టుపక్కల వెతకగా, వీధి కుక్కలు తిరుగుతున్న ప్రాంతంలో నవజాత శిశువు కనిపించిందని వైద్యులు తెలిపారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా శిశువు ప్రాణానికే ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు.
సకాలంలో సిబ్బంది స్పందించి పసికందును రక్షించారని, ప్రస్తుతం తల్లి, బిడ్డను అలప్పుజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని వైద్య బృందం పేర్కొంది. ప్రస్తుతం నవజాత శిశువుకు ప్రమాదం తప్పిందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
