ఇజ్రాయిల్ పై దాడి.. భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. కేరళ మహిళకు గాయాలు

ఇజ్రాయిల్ పై దాడి.. భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. కేరళ మహిళకు గాయాలు

ఇజ్రాయిల్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక నర్సు భారతదేశంలో నివసిస్తున్న తన భర్తతో వీడియో కాల్ మధ్యలో ఉండగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడిలో గాయపడినట్లు సమాచారం. ఏడేళ్లుగా ఇజ్రాయిల్‌లో ఉన్న షీజా ఆనంద్ (41), అక్టోబర్ 8 తెల్లవారుజామున ఇజ్రాయిల్‌పై హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించగా... అనంతరం తాను క్షేమంగా ఉన్నానని ఆమె తన కుటుంబంతో చెప్పింది.

ఆ తర్వాత ఆమె తన భర్తకు మరో కాల్ చేసింది. ఈ క్రమంలో ఓ భయంకరమైన పెద్ద శబ్ధంతో కాల్ అకస్మాత్తుగా కట్ అయింది. అనంతరం తోటి కేరళీయుడు.. ఆమె గాయపడిందని, శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆమె కుటుంబానికి సమాచారం అందించాడు. ఆమెను మరో సర్జరీ కోసం వేరొక ఆసుపత్రికి తరలించనున్నారు.

షీజా ఆనంద్ భర్త, ఇద్దరు పిల్లలు ఇండియాలో ఉన్నారు. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, కేరళకు చెందిన 2వందల మందికి పైగా బెత్లెహెమ్‌లోని ఒక హోటల్‌లో చిక్కుకుపోయి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం.