కేరళలో ఫుడ్ పాయిజనింగ్ తో మృతి చెందిన యువతి ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ను ఆదేశించారు. అంతేగాకుండా యువతి తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన ట్రీట్ మెంట్ ను పరిశీలిస్తామని ఆమె చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు.
కాసరగోడ్ కు చెందిన అంజుశ్రీపార్వతి డిసెంబర్ 31న ఓ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న బిర్యానీ (కుజిమంతి) తిని అస్వస్థకు గురైంది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్ణాటక మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ(శనివారం) మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ను ఆదేశించారు.
