ఆంత్రోపిక్‌తో చేతులు కలిపిన TCS.. 50వేల మందికి క్లాడ్ AIపై ట్రైనింగ్

ఆంత్రోపిక్‌తో చేతులు కలిపిన TCS.. 50వేల మందికి క్లాడ్ AIపై ట్రైనింగ్

ఐటీ దిగ్గజం టీసీఎస్ AI ప్రపంచంలో ఒక భారీ సంచలనానికి తెరలేపింది. గ్లోబల్ ఏఐ స్టార్టప్, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందిన 'ఆంత్రోపిక్' సంస్థతో చేతులు కలిపింది. కేవలం ప్రయోగాలు చేయడం కాకుండా.. గ్లోబల్ కంపెనీలకు ఏఐ సేవలను భారీ స్థాయిలో అందించడమే లక్ష్యంగా ఈ 'గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్' కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంత్రోపిక్‌కు చెందిన పాపులర్ ఏఐ మోడల్ 'క్లాడ్' టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి, దానిపై సొల్యూషన్స్ నిర్మించడానికి టీసీఎస్ ఒక ప్రత్యేకమైన బిజినెస్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయబోతోంది.

50 వేల టెక్కీలకు క్లాడ్ ట్రైనింగ్.. 
ఈ పార్ట్‌నర్‌షిప్‌లో మైండ్ బ్లోయింగ్ విశేషం ఏంటంటే.. టీసీఎస్ తన కంపెనీలోని ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ డిపార్ట్మెంట్లకు చెందిన 50వేల మంది ఉద్యోగులకు ఈ క్లాడ్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనుంది. కేవలం క్లయింట్ల కోసమే కాకుండా.. టీసీఎస్ ఈ టెక్నాలజీని తన అంతర్గత అవసరాల కోసం కూడా వాడుకోనుంది. దీని ద్వారా వచ్చే అనుభవంతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని టీసీఎస్ భావిస్తోంది. అలాగే టీసీఎస్ iON ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ క్లాడ్ ఏఐ మోడల్స్‌పై లెర్నింగ్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను కూడా ఆఫర్ చేయనున్నారు.

రూల్స్ ఎక్కువ ఉండే కంపెనీలపై స్పెషల్ ఫోకస్..
సాధారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, టెలికాం వంటి రంగాల్లో ప్రభుత్వ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కొద్దిగా తప్పు జరిగినా నష్టం భారీగా ఉంటుంది కాబట్టి.. ఇలాంటి సంస్థలు ఏఐ వాడకానికి కాస్త వెనుకాడతాయి. ఇప్పుడు టీసీఎస్, ఆంత్రోపిక్ జోడీ సరిగ్గా ఇలాంటి రంగాలనే టార్గెట్ చేశాయి. క్లాడ్ ఏఐ ఖచ్చితత్వం, నమ్మకత్వానికి టీసీఎస్ ఇండస్ట్రీ నాలెడ్జ్ తోడవడంతో.. ఆయా రంగాల్లోని పెద్ద కంపెనీలు భయం లేకుండా ఏఐ ప్రాజెక్టులను పైలట్ స్టేజ్ దాటించి లైవ్ లోకి తీసుకురావడానికి జోడీ సహాయపడనుంది. భారతదేశం తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని, టీసీఎస్‌తో పార్ట్‌నర్‌షిప్ తమ ఇండియా స్ట్రాటజీలో కీలకమని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ పేర్కొన్నారు.

మనుషులతో సమానంగా ఏఐ ఏజెంట్లు.. 
ఈ ఒప్పందానికి సరిగ్గా రెండు రోజుల క్రితమే టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక క్రేజీ అంచనాను తెరపైకి తెచ్చారు. రాబోయే 3 ఏళ్లలో టీసీఎస్‌లో టెక్కీలు ఎంతమంది ఉంటారో.. అంతే సంఖ్యలో 'ఏఐ ఏజెంట్లు' కూడా ఉంటారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆంత్రోపిక్‌తో కుదిరిన ఈ డీల్.. చంద్రశేఖరన్ చెప్పిన ఆ బోల్డ్ విజన్‌కు పునాది అని స్పష్టమవుతోంది. ఐటీ రంగంలో నియామకాలు మందగించినా ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ క్రేజీ పార్ట్‌నర్‌షిప్ మరోసారి నిరూపించింది.