వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. జూన్ 12 నుంచి లోన్స్ కాస్ట్లీ!

వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. జూన్ 12 నుంచి లోన్స్ కాస్ట్లీ!

సొంతిల్లు కొనుక్కోవాలన్నా, కొత్త కారు కొనాలన్నా లోన్ల కోసం చూసేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా షాకిచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)ను సవరిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ బెంచ్‌మార్క్‌తో లింక్ చేయబడిన అన్ని రకాల లోన్స్ మరింత ప్రియం కానున్నాయి. పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 12, 2026 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా  తెలిపింది.

బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అన్ని రకాల కాలపరిమితులపై MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచారు.
* ఓవర్‌నైట్ MCLR రేటును 7.80 శాతం నుండి 7.85 శాతానికి పెంచారు.
* ఒక నెల కాలపరిమితిపై వడ్డీ రేటు 7.90 శాతం నుండి 7.95 శాతానికి చేరింది.
* మూడు నెలల MCLR రేటు 8.15 శాతం నుండి 8.20 శాతానికి పెరిగింది.
* ఆరు నెలల MCLR రేటును 8.45 శాతం నుండి 8.50 శాతానికి సవరించారు.
* రీటైల్ రుణాలకు అత్యంత కీలకమైన 'వన్ ఇయర్ MCLR' రేటును 8.70 శాతం నుండి 8.75 శాతానికి పెంచారు.

ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
బ్యాంక్ ఆఫ్ బరోడాలో MCLR రేట్లకు లింక్ అయి ఉన్న హోమ్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ తీసుకున్న కస్టమర్లపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతుంది. లోన్ రీసెట్ గడువు వచ్చినప్పుడు కస్టమర్ల రుణాల భారం పెరిగి, వారి నెలవారీ EMIలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం అనేది వారు తీసుకున్న రుణ మొత్తం, కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లిక్విడిటీ పరిస్థితులు, ఫండింగ్ కాస్ట్స్ ఆధారంగా బ్యాంకులు తమ లోన్ రేట్లను సమీక్షిస్తున్నాయి. కొత్తగా లోన్లు తీసుకునే వారికి ఈ పెరిగిన రేట్లు తక్షణమే వర్తిస్తాయి. అయితే ఇప్పటికే లోన్ తీసుకున్న పాత కస్టమర్లకు వారి లోన్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం రీసెట్ డేట్ రోజున ఈ మార్పులు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.