ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీఓ ధమాకా: ఒకేసారి కోటీశ్వరులు అవుతున్న 4వేల400 మంది ఉద్యోగులు!

ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీఓ ధమాకా: ఒకేసారి కోటీశ్వరులు అవుతున్న 4వేల400 మంది ఉద్యోగులు!

అంతరిక్షంలోకి రాకెట్లను పంపే ఎలాన్ మస్క్ కంపెనీ 'స్పేస్ఎక్స్' ఇప్పుడు భూమిపై పైసల వర్షం కురిపించబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ కంపెనీ తీసుకొస్తున్న ఐపీఓ ఒకేసారి వేలాది మంది సాధారణ ఉద్యోగుల జీవితాలను మార్చేయబోతోంది. ఒక్క షేరు ధరను 135 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.12వేల 825 గా ఫిక్స్ చేశారు. ఈ లెక్కన స్పేస్ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.168 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరనుంది. ఈ ఐపీఓ దెబ్బకు కంపెనీలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది సైతం కోటీశ్వరుల క్లబ్‌లోకి చేరిపోతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

జీతాలతో పాటు షేర్లు.. ఇప్పుడు కాసుల పంట:
సాధారణంగా ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తే కేవలం ఓనర్లు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మాత్రమే వేల కోట్లు సంపాదిస్తుంటారు. కానీ స్పేస్ఎక్స్‌లో సీన్ వేరేలా ఉంది. ఇక్కడ పనిచేసే ఇంజనీర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, లాంచ్ సైట్ సిబ్బందికి జీతాలతో పాటు కంపెనీ స్టాక్ ఆప్షన్స్ పేరుతో షేర్లు ఇచ్చారు. అందువల్ల ఈ ఐపీఓ ద్వారా స్పేస్ఎక్స్‌లో పనిచేస్తున్న, పనిచేసి మానేసిన దాదాపు 4వేల 400 మందికి పైగా ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతున్నారు. ఇందులో మరీ క్రేజీ విషయం ఏంటంటే.. దాదాపు 400 మంది ఉద్యోగుల దగ్గర ఉన్న షేర్ల విలువ ఒక్కొక్కరికీ కనీసం రూ. 950 కోట్లు దాటబోతోంది.

స్పేస్ఎక్స్ రాకెట్లు ఆరంభంలో వరుసగా ఫెయిల్ అవుతున్న సమయంలో.. భవిష్యత్తుపై నమ్మకంతో క్యాష్ బోనస్‌లకు బదులు కంపెనీ షేర్లను నమ్ముకున్న ఉద్యోగుల పంట పండింది. ట్రెవర్ హైస్ అనే మాజీ లాంచ్ ఇంజనీర్ 2011లో కంపెనీలో చేరి 12 ఏళ్లు పనిచేశాడు. అతని దగ్గర ఉన్న లక్ష షేర్ల విలువ ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం కనీసం రూ.128 కోట్లు. అలాగే 2012లో చేరిన గావిన్ పెటిట్ అనే మరో ఇంజనీర్.. ఒక్కో షేరు విలువ కేవలం 14 డాలర్లుగా ఉన్నప్పుడు షేర్లను తీసుకున్నాడు. మధ్యలో కొన్ని షేర్లు అమ్ముకుని డెన్వర్‌లో ఇల్లు కొనుక్కున్నప్పటికీ.. అతని దగ్గర ఇంకా 50వేల షేర్లు ఉన్నాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 64 కోట్లు దాటిపోయింది.

యూఎస్‌లోనే కాదు.. లోకల్ మార్కెట్‌లోనూ హల్చల్
ఈ సంపద సృష్టి కేవలం పేపర్లకో, బ్యాంక్ అకౌంట్లకో పరిమితం కావడం లేదు. టెక్సాస్ పరిసర ప్రాంతాల్లోని స్పేస్ఎక్స్ 'స్టార్‌బేస్' లొకేషన్లలో నివసించే వేలాది మంది ఉద్యోగుల చేతుల్లోకి ఒకేసారి ఇంత భారీగా డబ్బు రానుండటంతో అక్కడ లోకల్ బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్ మార్కెట్, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్లు ఊహించని రేంజ్‌లో పుంజుకోనున్నాయి. గతంలో గూగుల్, ఫేస్‌బుక్ ఐపీఓల సమయంలో ఇలాంటి ఉద్యోగుల వెల్త్ క్రియేషన్ చూశాం. కానీ ఒక రాకెట్ తయారీ కంపెనీ ఇంతటి అద్భుతాన్ని సృష్టించడం ఆధునిక వ్యాపార చరిత్రలోనే ఇదే మొదటిసారి. రీయుజబుల్ రాకెట్లు, స్టార్‌లింక్ శాటిలైట్లతో అంతరిక్షాన్ని శాసిస్తున్న మస్క్.. ఈ ఐపీఓతో భూమిపై తన ఉద్యోగులని కుబేరులను చేసేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.