ట్రంప్ తీరు నచ్చట్లే.. నిరసనగా అమెరికా నేషనల్ కౌంటర్

ట్రంప్ తీరు నచ్చట్లే.. నిరసనగా అమెరికా నేషనల్ కౌంటర్
  • టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా
  • ఇజ్రాయెల్ ప్రెజర్​తోనే ఇరాన్​పై యుద్ధానికి దిగిండని కామెంట్​
  • నాటో దేశాలపై ట్రంప్ రుసరుస
  • హార్మూజ్ వద్ద గస్తీకి నో చెప్పడంతో హర్టయినట్లు వెల్లడి

వాషింగ్టన్: అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై సైనిక దాడుల సమర్థతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తాను మద్దతు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. "ఇరాన్ నుంచి మన దేశానికి తక్షణ ముప్పేమీ లేదు. 

ఇజ్రాయెల్, అమెరికాలోని దాని శక్తిమంతమైన లాబీ ఒత్తిడి వల్లే మనం ఈ యుద్ధాన్ని ప్రారంభించామనేది స్పష్టంగా కనిపిస్తోంది" అని కెంట్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత ఏడాది జులైలో ఈ పదవిని చేపట్టిన కెంట్.. ఉగ్రవాద ముప్పులను విశ్లేషించే విభాగానికి నాయకత్వం వహించారు. 

వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి వద్ద చమురు నౌకలకు రక్షణ కల్పించేందుకు తమకు ఎవరి సాయమూ అక్కర్లేదని, నాటో దేశాల సాయం అవసరమే లేదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జలసంధి వద్ద గస్తీ కోసం యుద్ధ నౌకలు పంపాలంటూ తాను చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు తోసిపుచ్చడంపై ట్రంప్ రుసరుసలాడారు. నాటో దేశాల నిర్ణయం తనను డిసప్పాయింట్ చేసిందని చెప్పారు. హార్మూజ్ లో నౌకల రవాణాను పునరుద్ధరించడానికి అమెరికాకు ఎవరి సాయమూ అవసరం లేదని, ఒంటరిగానే ఇరాన్ పై యుద్ధం కొనసాగించే శక్తి తమకు ఉందని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై తాము ప్రారంభించిన యుద్ధం కరెక్టేనని ట్రంప్  సమర్థించుకున్నారు. ఇరాన్  అణ్వాయుధాలు తయారు చేసుకుంటే వాటిని ప్రయోగించి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్  వద్ద అణుబాంబులు ఉండడానికి వీల్లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ట్రూత్ సోషల్​లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ఇరాన్​పై ఇజ్రాయెల్​తో కలిసి మేము ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు ధరలు పెరిగాయని అమెరికాపై కొంతమంది నిందలు వేస్తున్నారు. అమెరికాను విమర్శించే వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు వస్తే ఏంటి పరిస్థితి? అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. దాని కన్నా చమురు ధరలు పెరగడమే బెటర్  కదా” అని ట్రంప్  అన్నారు.

జో కెంట్ రాజీనామాపై స్పందిస్తూ..
కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామాపై ట్రంప్ స్పందించారు. భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కెంట్ బలహీనుడని, ఆయన రాజీనామా చేయడమే సరైందని అన్నారు. ‘‘ఇరాన్​తో  ముప్పు ఉందనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసు కానీ ఈయనకు మాత్రం తెలియదట.. అలాంటి వ్యక్తి బాధ్యతల నుంచి వైదొలగడమే మంచిది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.