పనిచేయించుకొని జీతం ఇస్తలేరు

పనిచేయించుకొని జీతం ఇస్తలేరు
  • 16 నెలలుగా కేజీబీవీ టీచర్లకు అందని శాలరీస్​ 
  • ఎస్ఎస్ఏ, ఫైనాన్స్​ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం 

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ), ఫైనాన్స్​ఆఫీస్​  విభాగాల మధ్య సమన్వయ లోపంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) గతేడాది రిక్రూటైన టీచర్లకు శాలరీస్​ రావడం లేదు.16 నెలలుగా వేతనాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఎస్ఎస్ఏ ఆఫీసర్లు మాత్రం సమస్యను పరిష్కరించడం కాకుండా, ఇంకా పెండింగ్​లోనే ఉంచాలనే దోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచర్(ఎస్ఓలు, పీజీసీఆర్టీ, సీఆర్టీ) పోస్టుల భర్తీకి గతంలో ఎస్ఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చింది. 2019 సెప్టెంబర్​లో అందరిని సెలెక్ట్ చేసి, ఉమ్మడి జిల్లాల వారీగా రిక్రూట్​ చేసింది.  సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర ప్రాసెస్​తో ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్​, మెదక్ తదితర జిల్లాల్లో సుమారు 90 మంది టీచర్లు కొంచె లేట్ గా రిక్రూట్ అయ్యారు. కొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి, మార్చిలో కాగా, ఉమ్మడి ఖమ్మం ఏజెన్సీ ఏరియాలోని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో గతేడాది అక్టోబర్ లో పోస్టింగ్​లు ఇచ్చారు. రిక్రూట్​మెంట్ ఫైళ్లను స్టేట్ ఎస్ఎస్ఏ ఆఫీసర్లు.. ఆశాఖ ఫైనాన్స్ విభాగానికి అప్పట్లోనే పంపించారు. అయితే కరోనా తీవ్రతతో విద్యాసంస్థలకు సర్కారు సెలవులు ప్రకటించింది. స్కూళ్లే లేని సమయంలో వీరిని ఎందుకు రిక్రూట్​ చేశారని ఫైనాన్స్ ఆఫీసర్లు కొర్రీ పెట్టినట్టు తెలిసింది. దీనిపై ఎస్ఎస్ఏ అధికారులు ఆన్​లైన్​ క్లాసులు తీసుకుంటున్నారని వివరణ ఇచ్చినా, వారి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని టీచర్ల సంఘాలు తెలిపాయి. 
మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. 
యూనియన్ల లీడర్లు ఈ సమస్యను మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆ ఫైల్​కు ఫైనాన్స్ విభాగం ఒకే చెప్పింది. అయితే మళ్లీ ఆ ఫైల్ నెల రోజులుగా ఎస్ఎస్ఏ ఎస్పీడీ వద్ద ఆగిందని టీచర్లు చెప్తున్నారు. నెలల తరబడి జీతాల్లేక అవస్థలు పడుతున్న టీచర్లకు, ఎస్ఎస్ఏ ఉన్నతాధికారులు న్యాయం చేయకుండా  కాలయాపన చేసే పనిలో పడ్డారు. ఈ ఇష్యూను ఎస్ఎస్ఏ ఈసీ మీటింగ్​లో పెట్టి చర్చించిన తర్వాతే జీతాలు వేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లలో పనిచేస్తున్నామని, అయినా తమకు ఎందుకు జీతాలివ్వడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. తమకు నెలల తరబడి జీతాలు పెండింగ్​లో ఉన్నా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కేజీబీవీ టీచర్లకు జీతాలియ్యాలని, లేకపోతే ఆందోళన తప్పదని టీపీటీఎఫ్​, టీఎస్​యూటీఎఫ్ నేతలు హెచ్చరిస్తున్నారు.