వంగూరు, వెలుగు: కస్తూరిబా గాంధీ బాలిక వికాస విద్యాలయం, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది , సమగ్ర శిక్ష ఉద్యోగుల వివిధ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. చిన్నయ్య మాట్లాడుతూ కేజీబీవీ, యుఆర్ఎస్, ఎస్ఎస్ఎ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయని తెలిపారు.
రెండు దశాబ్దాలుగా నిరంతరం పనిచేస్తున్నా కూడా చాలీచాలని వేతనాలు మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం 29 రోజుల పాటు సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంగీకరించిన అనేక అంశాలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోతే ఈ నెల 16న జిల్లా కేంద్రంలో నిరసన , మార్చి 20న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డబ్లుఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కె. లింగమయ్య, కేజీబీవీ ఎస్ఓ కృష్ణవేణి, వంగూరు మండల కమిటీ అధ్యక్షుడు ఈ. జంగయ్య, ప్రధాన కార్యదర్శి వై. మల్లేష్ పాల్గొన్నారు.
