
- కన్నడ స్టార్ హీరో యశ్ కు పెరుగుతున్న పాపులారిటీ
- రూ.1200 కోట్ల క్లబ్ లో చేరిన మూడో ఇండియన్ మూవీగా కేజీఎఫ్ చాప్టర్ 2
- CEO OF BOXOFFICE YASH అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజీఎఫ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే కేజీఎఫ్ చాప్టర్ 2 సైతం రిలీజైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలూ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 1, ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది. దాంతో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ స-ృష్టించిన మాస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా పేరు తెచ్చుకొని, విజయ దుందుభి మోగించింది.
ఇక కలెక్షన్ల విషయానికొస్తే అమీర్ ఖాన్ నటించిన దంగల్, ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి చిత్రాల తర్వాత ఆ స్థాయి వసూళ్లు రాబట్టింది కేజీఎఫ్ 2 మాత్రమే. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా ('బాహుబలి 2' తర్వాత) 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' మూవీ నిలిచింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగాఈ మూవీ ఇప్పటివరకూ రూ.1200 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. అంతే కాదు ఈ క్లబ్‌లో చేరిన మూడో భారతీయ సినిమాగా నిలిచి అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా అవేవీ కేజీఎఫ్ 2 వసూళ్లపై ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఈ సినిమా మరిన్ని రికార్డు కొల్లగొడుతుందని సినీ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరో విశేషమేమిటంటే కేజీఎఫ్ 2 సినిమా ఇంతటి భారీ విజయం సొంతం చేసుకోవడంతో రాఖీభాయ్ ఫ్యా్న్స్ తెగ సంబరపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా CEO OF BOXOFFICE YASH అనే ట్యాగ్ ను జతచేస్తూ, తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 దండయాత్ర సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుండడం చెప్పుకోదగిన విషయం.