ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అంతా స్పెషలే..

ఖైరతాబాద్ గణేశ్  నిమజ్జనం అంతా స్పెషలే..
  • ఇప్పటికే విజయవాడ నుంచి వచ్చిన భారీ వాహనం  
  • 75 అడుగుల పొడవు..11 అడుగుల వెడల్పు  
  • 26 టైర్లు..100 టన్నులు మోసే కెపాసిటీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. 71 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖైరతాబాద్​గణేశుడు ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను ఆకర్షించాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతినిచ్చిన నిర్వాహకులు ఆ తర్వాత దర్శనాలను నిలిపివేసి నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బడా గణేశ్​నిమజ్జనం ఎలా చేస్తారా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో భారీ గణనాథుడిని ప్రతిష్ఠించిన చోటు నుంచి హుస్సేన్​సాగర్​తీరంలోని ఆరో నంబర్​క్రేన్​వద్దకు తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్​వచ్చింది. దీన్ని గణేశుడి ఎదుట నిలిపి వెల్డింగ్​పనులు కూడా ప్రారంభించారు. విజయవాడ నుంచి రెండు రోజుల కింద బయలుదేరగా, బుధవారం తెల్లవారుజామున ఖైరతాబాద్​చేరుకుంది. దీంతో అంతా ఈ టస్కర్​స్పెషాలిటీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  

100  టన్నులు ఈజీగా మోస్తుంది

ఖైరతాబాద్​గణేశుడు 40 నుంచి 50 టన్నుల బరువుంటాడు. ఈ భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపై తరలించడం అస్సలు సాధ్యపడదు. అందుకే విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈ భారీ టస్కర్‌ను తెప్పించారు. దీని పొడవు 75 అడుగులు ఉంటుంది. వెడల్పు 11 అడుగులు..దీని చక్రాల సంఖ్య 26.  ఈ టస్కర్​100 టన్నులను కూడా అవలీలగా మోస్తుంది. 

నిమజ్జనం చేసే క్రేన్​ స్పెషాలిటీ..

-50 టన్నులున్న ఖైరతాబాద్​గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రేన్ 100 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది..ఇది బడా గణేశ్​విగ్రహాన్ని ఈజీగా ఎత్తి నీటిలో నిమజ్జనం చేయగలదు. దీని ఎత్తు 60 నుంచి -70 అడుగులకు పైగా ఉండడం వల్ల విగ్రహాన్ని హుస్సేన్​సాగర్​లో సురక్షితంగా నిమజ్జనం చేయవచ్చు. ఈ క్రేన్‌లు సాధారణంగా హైడ్రాలిక్ టెలిస్కోపిక్ బూమ్ క్రేన్‌లు, ఇవి భారీ బరువులను ఎత్తడానికి మరియు ఖచ్చితమైన స్థానంలో ఉంచడానికి రూపొందించబడ్డాయి.

వెల్డింగ్​ పనుల్లో 20 మంది 

ఈ భారీ టస్కర్‌పై వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఒకవైపు దర్శనం కొనసాగుతుండగానే మరోవైపు టస్కర్​పై విగ్రహం ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్​పనులు చేస్తున్నారు. విగ్రహాన్ని సురక్షితంగా అమర్చేందుకు ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్ తొలగించి, రాత్రి 12 గంటలకు కలశ పూజ నిర్వహించి, విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు. 

రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గణపతిని టస్కర్‌పైకి ఎక్కించి, మూడు గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ పనులు చేస్తారు. శనివారం ఉదయం పోలీసులకు అప్పగిస్తారు. ఖైరతాబాద్​నుంచి నిమజ్జన పాయింట్​వరకూ టెలిఫోన్​భవన్, సెక్రటేరియేట్, ఎన్టీఆర్​మార్గ్​ మీదుగా 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనున్నది. బడా గణేశుడి చుట్టూ ఉన్న శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, కన్యకా పరమేశ్వరి, గజ్జలమ్మ దేవి విగ్రహాలను కూడా తరలించేందుకు హైదరాబాద్‌కు చెందిన మరో ట్రక్‌ను ఉపయోగించనున్నారు.