గణపయ్యకు తీరొక్క రంగులు

గణపయ్యకు తీరొక్క రంగులు

ఖైరతాబాద్​ బొజ్జ గణపయ్య రంగులద్దుకుని ముస్తాబు అవుతున్నడు. 61 అడుగుల భారీ వినాయకుడిని 12 తలలు,
12 సర్పాల బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. ఒక్కో తలకు ఒక్కో రంగు వేస్తున్నారు. పండక్కి నాలుగు రోజుల ముందే భక్తులకు దర్శనం కలిగేలా ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. వాటర్​ కలర్స్​ వాడడం వల్ల హాని ఉండదని ఆర్టిస్ట్​ భీమేశ్​ చెప్పారు.

ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా ఇటీవలే రంగులు వేయడం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన భీమేష్​బృందం ( సత్య ఆర్ట్స్‌) రంగులు వేసే పనిని చేపట్టింది. పాతిక మందితో కూడిన ఈ బృందం నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించి రంగులు అద్దుతున్నారు. ఈనెల 27వ తేదీకల్లా రంగుల ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు బృందం నాయకుడు భీమేష్​చెప్పారు. విభిన్న రకాల రంగులతో స్వామి విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. స్వామి విగ్రహంలో ఏ భాగానికి ఏ రంగు వేయాలి? ఎన్ని రకాల రంగులు వాడాలనే అంశాలను  ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. పదేళ్ల నుంచి ఏటా విగ్రహానికి సత్య ఆర్ట్స్‌ వారే రంగులు వేస్తున్నారు. 61 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహానికి 12 తలలు, 12 సర్పాలు ఉన్నాయి. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగును వేస్తున్నట్టు భీమేష్​తెలిపారు.  ఆభరణాలకు వాడే రంగులను విజయవాడ నుంచి తెప్పించారు. స్వామి వారు ధరించే పంచెకు కూడా భక్తులను ఆకట్టుకునేలా రంగులు అద్దుతున్నారు. మొత్తం విగ్రహానికి దాదాపు 400 లీటర్ల రంగులు వాడుతున్నామని, అన్నీ వాటర్​ కలర్సే కాబట్టి ఎలాంటి కలుషితం ఉండదని చెబుతున్నారు.

ఆకట్టుకునే రంగులు వేస్తున్నాం
ఖైరతాబాద్ గణపతి గురించి భక్తులు ఎంతో ఘనంగా ఊహించుకుంటారు. ప్రతి సంవత్సరం ఎన్నో విశేషాలు, మరెన్నో విశిష్టతలతో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం 61 అడుగుల భారీ విగ్రహాన్ని భక్తులందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. రంగులు వేసే పనులు కొనసాగిస్తున్నాం. పదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం మేమే రంగులు వేస్తున్నాం. ఇది మాకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాం. స్వామివారి దీవెనలు అందరిపైనా ఉండాలి. – భీమేష్, పెయింటర్