
- అదేరోజు అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబులు
- రేట్లు భారీగా తగ్గనుండడంతో కొనుగోళ్లు వాయిదా
- షాపులు, ఆన్‌లైన్‌లో తగ్గిన సేల్స్.. ఈ–కామర్స్ సైట్లలోనూ 22 తర్వాతే ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ తోపాటు ఇతర వస్తువుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ స్లాబుల మార్పులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుండటంతో జనం కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని ప్రజలు తమ కొనుగోళ్లను ఆ తేదీ తర్వాతకు మార్చుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం దుకాణాల్లో, షోరూమ్‌లలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి. జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేకించి, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్‌ల వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. ఈ కారణంగా, ప్రజలు తమ కలల వస్తువులను కొనుగోలు చేయడానికి అదే సరైన సమయమని భావిస్తున్నారు. చాలామంది షోరూమ్‌లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం సెప్టెంబర్ 22వ తేదీ తర్వాతకు వాయిదా వేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్‌లో, రిటైల్ దుకాణాలలో గతంలో కనిపించే సందడి ఇప్పుడు లేదు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా, అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. చాలామంది కస్టమర్లు "జీఎస్టీ తగ్గుతుంది కదా, 22 తర్వాత వస్తాం" అని చెప్పి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.
కొన్నింటిపై భారీగా తగ్గనున్న ధరలు..
ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28% వరకూ ఉంది. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్18%కి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై18% నుంచి 5%కు కూడా తగ్గుతుంది. మధ్యస్థాయి కారుపై రూ. 1.5 లక్షల వరకు, బైక్‌లపై రూ. 10 వేల నుంచి 20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. టీవీలపై రూ. 5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2–5 వేల మధ్య, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల మధ్య తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.
‘ఈ-–కామర్స్’ ఆఫర్లూ అప్పుడే..
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైతం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ఈ కంపెనీలు, ఈసారి తమ మెగా ఆఫర్లను 22వ తేదీ తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్లపై తాత్కాలికంగా ఆఫర్లను నిలిపివేశాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత "బిగ్ బిలియన్ డేస్", "గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి.
కొత్త 4కే టీవీ కొందామని అనుకున్నా. జీఎస్టీ తగ్గించారని తెలియడంతో, కొన్ని వేల రూపాయలు ఆదా అవుతాయి కదా అని 22వ తేదీ వరకు ఆగాలని నిర్ణయించుకున్నా.
సురేష్(35), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
మా కొడుకు కోసం కొత్త బైక్ కొనడానికి షోరూమ్‌కు వెళ్ళాను. 22 తర్వాత ధరలు తగ్గుతాయని చెప్పారు. అందుకే కొనుగోలును వాయిదా వేశాం.
అశోక్ (45), చిరు వ్యాపారి
కొత్త ల్యాప్‌టాప్ కోసం ఆన్‌లైన్‌లో చూస్తున్నాను. నాకు నచ్చిన మోడల్‌పై 22వ తేదీ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని తెలిసింది. అందుకే వెయిట్ చేస్తున్నా.
కిరణ్ (24), విద్యార్థి
సాధారణంగా ఆదివారం రోజున 15 నుంచి-20 టీవీలు అమ్ముతాం. గత ఆదివారం ఒక్కటి కూడా అమ్మలేదు. కస్టమర్లు వస్తున్నా.. 22వ తేదీ తర్వాతే కొంటామని చెప్పి వెళ్తున్నారు.
ఎలక్ట్రానిక్స్ షాప్ యజమాని, కూకట్‌పల్లి