
ఖాట్మండు: నేపాల్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోమవారం (సెప్టెంబర్ 8) పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన జడ్ జెన్ యువత.. ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 9) మరోసారి రోడ్డెక్కారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ముందు భారీ ఆందోళన చేపట్టారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సమాచారశాఖ మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని.. ఇప్పటికే విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. యువత నిరసనలతో దేశ రాజధాని ఖాట్మండులో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళనలను అదుపు చేసేందుకు ఖాట్మండులో మరోసారి కర్య్ఫూ విధించారు అధికారులు. యువత డిమాండ్ మేరకు ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ.. ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తోంది. జన్ జెడ్ యువత నిరసనలతో ప్రభావంతో ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు రాజీనామా చేశారు. హోంమంత్రి పదవికి రమేష్ అలేఖ్, వ్యవసాయ మినిస్టర్ పోస్ట్‌కు రామ్‌నాధ్ అధికారి రిజైన్ చేశారు. మంత్రుల వరుస రాజీనామాలతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.