
Urban Company IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొంత నెమ్మదించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మార్కెట్లకు మోడీ సర్కార్ జీఎస్టీ 2.0 బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాత వస్తున్న ఐపీవోలపై మాత్రం ఇన్వెస్టర్లు భారీ అంచనాలను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని ఐపీవోలు ఇష్యూ ప్రారంభానికి మునుపే గ్రేమార్కెట్లో లాభాల జోరును కొనసాగిస్తూ బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అర్బన్ కంపెనీ ఐపీవో గురించే. ప్రపంచ ప్రఖ్యాత స్టార్టప్ పెట్టుబడి సంస్థ టైగర్ గ్లోబల్ మద్ధతు కలిగిన కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 12 వరకు పెట్టుబడిదారుల కోసం అందుబాటులోకి వస్తోంది. అయితే వాస్తవానికి ఐపీవో బుధవారం స్టార్ట్ అవుతున్నప్పటికీ సెప్టెంబర్ 9న గ్రేమార్కెట్లో భారీ ప్రీమియం లాభాలు పలుకుతోంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.వెయ్యి 900 కోట్లు సేకరించే లక్ష్యంతో ఐపీవోను ప్రారంభిస్తోంది. ఇందులో రూ.472 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉండనుంది.
ALSO READ : భారత్ పై 50 శాతం సుంకాలు తప్పే..
కంపెనీ ఐపీవో కోసం తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.98 నుంచి రూ.103గా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరు వాస్తవ ఇష్యూ రేటు కంటే 34 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఇదే జోరు లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే స్టాక్ ఒక్కోటి రూ.138 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో కంపెనీ తన లాట్ పరిమాణాన్ని 145 షేర్లుగా ఖరారు చేసింది.
కంపెనీ వ్యాపారం..
అర్బన్ కంపెనీ 2014లో తొలుత అర్బన్ క్లాప్ అనే పేరుతో స్టార్ట్ చేయబడింది. ఇది టెక్ ఆధారిత హోమ్ అండ్ బ్యూటీ సేవలను ఆఫర్ చేస్తోంది. షేషియల్స్ నుంచి ప్లంబింగ్ వర్క్స్ వరకు అన్ని రకాల సేవలను ఇది ఆఫర్ చేస్తోంది. కంపెనీ వద్ద ప్రస్తుతం 48వేల కంటే ఎక్కువ లిస్టెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు. కంపెనీ ఇండియాతో పాటు సింగపూర్, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో కూడా తన వ్యాపారాన్ని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆదాయంలో దాదాపు 90 శాతం భారత మార్కెట్ల నుంచి వస్తున్నట్లు వెల్లడైంది. తాజా ఐపీవో ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ వ్యాపార విస్తరణతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ ఖర్చులకు వినియోగించాలని చూస్తోంది.