భారత్ పై 50 శాతం సుంకాలు తప్పే.. చైనాలో పెట్టుబడులకు ఆహ్వానం: జు ఫీహాంగ్

భారత్ పై 50 శాతం సుంకాలు తప్పే.. చైనాలో పెట్టుబడులకు ఆహ్వానం: జు ఫీహాంగ్

ప్రస్తుతం ప్రపంచ టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుతం అత్యంత వేగంగా ముందుకెళుతున్న భారత వృద్ధికి ఇటీవల ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు అవరోధంగా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిని అధిగమించటానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తుండగా.. చైనా కూడా అండగా నిలబడటానికి ముందుకొస్తోంది. 

భారత్ పై 50 శాతం సుంకాలు వేయటం పూర్తిగా ఏకపక్షమైనవని, అంగీకరించదగినవి కాదని రాయబారి జు ఫీహాంగ్ సోమవారం అన్నారు. అమెరికా ఇలా బెదిరింపులకు దిగటం అన్యాయమైనది ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, చైనాలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ బీజింగ్ మదిలో మాటను జు బయటపెట్టారు. ఇది రెండు దేశాల మధ్య న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

వాస్తవానికి అమెరికా చాలా కాలంగా స్వేచ్ఛా వాణిజ్యం నుంచి ప్రయోజనం పొందిందని.. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి "అధిక ఆదాయం" పొందడానికి సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తోందని జు ఆరోపించారు. ఇదే క్రమంలో పాకిస్థాన్ అంశం గురించి మాట్లాడుతూ.. చైనా-భారత్ సంబంధాలను ఏ మూడవ దేశం ప్రభావితం చేయదన్నారు. వాస్తవానికి ఇండియా, పాక్ ఉగ్రబాధిత దేశాలన్న జు వాటిని ఎదుర్కోవటానికి ఇరు దేశాలు కలిసి ముందుకెళ్లటం ముఖ్యమని అన్నారు. 

అలాగే భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్రైట్స్ త్వరలోనే తిరిగి స్టార్ట్ అవుతున్నాయని జు చెప్పారు. అలాగే భారత్--చైనా సరిహద్దు ప్రాంతంలో.. సరిహద్దు డీలిమిటేషన్ కోసం వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ (WMCC) కింద చర్యల కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఈ ఏడాది మెుదటి 7 నెలల కాలంలోనే రెండు దేశాల మధ్య బిజినెస్ 88 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు.