ఖైరతాబాద్కు క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ఖైరతాబాద్కు క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. మహగణనాథుడిని దర్శించుకుని గణపతి హోమం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. వీకెండ్ కావడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వేలాదిగా రావడంతో క్యూలైన్ కిటకిటలాడుతోంది. వినాయకుడి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి బారులు తీరారు. 

వివిధ జిల్లాల నుంచి గణనాథుని దర్శనం కోసం భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండ బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు పోలీసులు. 

భక్తుల రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తరచూ కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. 

మరోవైపు భక్తులు, కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ గణేష్ మండప పరిసరాలు సందడిగా మారాయి. ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులకు పైగా దర్శించుకునే అవకాశం ఉంది. ప్రతీయేటా అనేక ప్రత్యేకతలతో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను దర్శనమిస్తారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. 

చరిత్రలోనే తొలిసారి 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సరస్వతీ, వారాహీ మాతలతో శ్రీదశ మహా విద్యాగణపతి దశ హస్తాలతో కొలువు దీరారు.