- రెండు రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యేల జాయినింగ్
- బీఆర్ఎస్ ను కార్పొరేట్ కంపెనీలా నడిపిన కేటీఆర్
- పార్టీ ఎమ్మెల్యేలను ఆయన పురుగుల్లా చూసేవారు
- కేటీఆర్ బినామీలు వేలకోట్లు దండుకున్నరు
- గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకు, రాజేశ్ రాజు వందల కోట్లు సంపాదించిండ్రు
- కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతాను
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది నలుగురేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోందని చెప్పారు. రెండు రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యేల జాయినింగ్ ఉంటుందన్నారు. ఇవాళ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని విమర్శించారు. ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని చెప్పారు.
ALSO READ | న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ తరహాలో..హైదరాబాద్ లో వీడియో బిల్ బోర్డులు
ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వాటి వివరాలను త్వరలోనే బయటపెడ్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో విలువలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దానం అన్నారు. కేసీఆర్ వ్యవహార శైలినీ దానం తప్పుబట్టారు. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండరని, ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటారని పేర్కొన్నారు. ఒకవేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా.. గంటల తరబడి కేసీఆర్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడ్త
పదేండ్లలో కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. త్వరలో సాక్ష్యాలతో సహా బయటపెడుతానని దానం చెప్పారు. కేటీఆర్ ఫ్రెండ్స్ గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు...రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్నో వందల కోట్లు సంపాదించారని, ఆ లెక్కలన్నీ బయటకు తీస్తామన్నారు.
కవిత జైల్లో ఉంటే రాజకీయాలా..
సొంత కుటుంబ సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉంటే ఆమెను బయటికి తీసుకురాకుండా కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. కావాలనే కవితను జైల్లోనే ఉంచుతున్నారని విమర్వించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వాళ్లు ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పక్షం రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ మెర్జ్ అవుతుందని చెప్పిన దానం.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నింటినీ బయటికి తీస్తామని అన్నారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మూతపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ విలువ, స్వేచ్ఛ ఉంటాయని దానం స్పష్టం చేశారు.
ALSO READ | పార్టీలోకి వస్తా అంటే ఎవరైనా వద్దంటారా : మంత్రి శ్రీధర్ బాబు
