హైదరాబాద్: హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం వద్ద నగదు రవాణా వాహనం దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ రెహమాన్ (46)ను కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా వద్ద అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.9,53,760 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఇన్నోవా క్రిస్టా వాహనం తాళం చెవి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
బషీర్ బాగ్లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 19న క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (CSS) సిబ్బంది వివిధ వ్యాపార సంస్థల నుంచి నగదు సేకరించి కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖకు చేరుకున్నారు.
ఈ సమయంలో ఇద్దరు కస్టోడియన్లు నగదుతో బ్యాంకులోకి వెళ్లగా, గన్‌మ్యాన్ వాష్ రూమ్ కోసం వాహనం నుంచి బయటకు వెళ్లాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న క్యాష్ రవాణా చేస్తున్న డ్రైవర్ షేక్ రెహమాన్ రూ.19 లక్షల నగదు ఉన్న వాహనాన్ని తీసుకుని పరారయ్యాడు. దీనితో కస్టోడియన్ గడ్డం మల్లేష్ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ వాహనం కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి సమీపంలో గుర్తించారు. అయితే అందులోని రెండు నగదు బ్యాగ్స్లో ఉన్న 9.6 లక్షలను నిందితుడు తీసుకొని పారిపోయినట్లు గమనించారు.
Also Read : వృద్ధ తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుక్కి 2 నెలల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు
సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు సహాయంతో నిందితుడు గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం, మే 21న గుల్బర్గా సబేరా గెస్ట్ హౌస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని , అతని నుండి 9.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన సుల్తాన్ బజార్ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
