
- అధికారులకు ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశం
ఖమ్మం టౌన్, వెలుగు : లబ్ధిదారుల ఆమోదంతో పాడి పశువులను కొనుగోలు చేయాలని, అందులో రూల్స్ తప్పనిసరిగా పాటించాలని ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరా మహిళా డెయిరీ గ్రౌండింగ్ లో భాగంగా ప్రస్తుతం మొదటి విడతలో 125 సభ్యులకు రెండు పాడి పశువుల చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
పాడి పశువుల కొనుగోలు కోసం కొనుగోలు కమిటీ లబ్ధిదారులతో కలిసి వెళ్లాలని, అక్కడ 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున వసతి కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పాడి పశువులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తాం, ఎంతకు కొనుగోలు చేస్తాం, రవాణాకు అయ్యే ఖర్చు, బీమా లాంటి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ కే. నవీన్ బాబు, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
పీఎం శ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగించాలి..
జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులు సమర్థవంతంగా వినియోగించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ అన్నారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాఓల పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పాఠశాల నిర్వహణ గ్రాంట్ కింద మంజూరు చేసిన నిధులను వినియోగించిన తీరు వివరాలను అందించాలని ఆదేశిచంఆరు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దేశంలో ఇతర ప్రాంతాల కళలు, సంస్కృతి పట్ల అవగాహన ఉండేలా కార్యక్రమాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగ పద్మజ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, ఎల్ డీఎం పీఎం శ్రీ పాఠశాల హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.