12న ఖమ్మంలో వేంకటేశ్వరాలయ శంకుస్థాపన..ప్రజలంతా భాగస్వాములు కావాలి

12న ఖమ్మంలో వేంకటేశ్వరాలయ శంకుస్థాపన..ప్రజలంతా భాగస్వాములు కావాలి
  • నా పదవి అభివృద్ధి కోసమే.. పోలీస్ పైరవీల కోసం కాదు : తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని అల్లీపురం వద్ద నిర్మించనున్న వేంకటేశ్వరాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై, సక్సెస్ చేయాలని మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 12న నిర్వహించనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంపై సోమవారం ఖమ్మంలోని కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని భక్తిభావంతో, పండుగలా నిర్వహించాలని సూచించారు. తన మంత్రి పదవి.. పోలీసుల పైరవీలు కోసం కాదని, సాగునీటి ప్రాజెక్ట్ లు, జాతీయ రహదారులు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేసేందుకని మంత్రి స్పష్టం చేశారు. 

దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసేందుకు సీతారామ ప్రాజెక్ట్, ఖమ్మం నుంచి హైదరాబాద్ మూడు గంటల్లో వెళ్లేలా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. పదవులు ప్రజాసేవకే అంకితం కావాలని, తన చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ఎఫ్ సీఐ బైపాస్ రోడ్డు దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ నుంచి ఎంబీ గార్డెన్స్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు అందాలని చెప్పారు. పేదరికం నుంచి విముక్తి పొందాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ఆయన వెంట సీపీ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల   దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ పాల్గొన్నారు.